ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మంత్రి పేరు చెప్పి .. మాయ చేస్తున్నారు.. - ysrcp leaders illigal activities at punganuru

చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణ శివార్లలో రోజురోజుకు అనధికారిక లేఔట్లు పెరిగిపోతున్నాయి. ఫలితంగా ప్రభుత్వం ఆదాయం కోల్పోవాల్సి వస్తోంది.. ఇటు ప్లాట్లు కొనుగోలు చేసే ప్రజలు భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ అక్రమాలను ఎవరైనా అధికారులు ప్రశ్నిస్తే.. సదరు వ్యక్తులు మంత్రి పేరు చెబుతున్నారు. అధికారులు ఈ విషయాన్ని మంత్రికి నేరుగా చెప్పే ధైర్యం చేయలేకపోతున్నారు. దీన్ని అలుసుగా తీసుకొని మరికొందరు అధికార పార్టీ నాయకులు ఇటువంటి అక్రమాలకు పాల్పడుతున్నారు.

illigal layout at punganuru
illigal layout at punganuru

By

Published : Jul 9, 2021, 10:32 AM IST

ఈ చిత్రంలో కనిపిస్తున్నది పుంగనూరు మండల పరిధిలోని చెర్లోపల్లి వద్ద లేఔట్‌. దీనికి సంబంధించి గ్రామ పంచాయతీ నుంచి రియల్టర్లు ఎటువంటి అనుమతులు తీసుకోలేదు. చెన్నై- ముంబయి జాతీయ రహదారికి సమీపంలో ఉన్న ఈ లేఔట్‌ను కొందరు అనధికారికంగా వేశారు. అడ్డుకోవాల్సిన అధికారులు మిన్నకుండిపోయారు. ఫలితంగా ఇక్కడ ఎవరైనా ప్లాట్లు కొంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. క్షేత్రస్థాయిలో సక్రమంగా పరిశీలిస్తే మరిన్ని వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

చిత్తూరు జిల్లావ్యాప్తంగా అక్రమ లేఔట్లపై కొన్నినెలల క్రితం అధికారులు వివరాలు సేకరించారు. గ్రామాల్లో 400, పట్టణాల్లో 399 అనధికారిక లేఔట్లు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో భాగంగా పుంగనూరు పురపాలిక పరిధిలో 15 అనధికారికంగా లేఔట్లు ఉన్నాయని నిర్ధారించారు. వీటి విస్తీర్ణం 31.552 ఎకరాలని తేల్చారు. వాస్తవంగా పుంగనూరు మున్సిపాలిటీ, శివారుతో కలుపుకుంటే మొత్తం 200 ఎకరాలకు పైగానే అక్రమ లేఔట్లు ఉండే అవకాశం ఉంది. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తేనే వాస్తవాలు వెలుగులోకి రానున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూముల్లో అనుమతులు లేకుండా వేస్తున్న లేఔట్లకు అడ్డుకట్ట వేయాలని మంత్రి పెద్దిరెడ్డి గతనెలలో అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఇందుకు జిల్లా, డివిజన్‌ స్థాయిలో విజిలెన్సు బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. అవసరమైన పక్షంలో అనధికారిక లేఔట్లను క్రమబద్ధీకరించేందుకు ఎల్‌ఆర్‌ఎస్‌ తీసుకురావాలని యోచిస్తున్నట్టు అప్పట్లో ఆయన పేర్కొన్నారు. ఈనేపథ్యంలో అధికారులు రంగంలోకి దిగి.. చర్యలు చేపడితే పంచాయతీల ఆదాయం పెరగడంతోపాటు ప్రజలకు చట్టపరమైన ఇబ్బందులు తప్పుతాయి.

ప్రభుత్వ భూములనూ ఆక్రమిస్తూ..

పుంగనూరు మండలంలోని రాగానిపల్లె, మేలుపట్ల, భీమగానిపల్లె, కుమ్మరనత్తం గ్రామాల్లో ఎక్కువగా అనధికారిక లేఔట్లు ఉన్నాయి. ఇందులో కొన్ని ప్రభుత్వ భూములు కూడా ఉన్నట్టు సమాచారం. కొందరు వాగు పోరంబోకు స్థలాలు, కుంటలను లేఔట్లలో కలిపేస్తున్నారు. ద్వితీయ శ్రేణి నాయకులు కొందరు ఇలా అక్రమాలకు పాల్పడుతుండటంతోనే.. ఇటీవల మంత్రి పెద్దిరెడ్డి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలతో మమేకమై సమస్యలు పరిష్కరించాలే తప్ఫా. ఇటువంటి కార్యకలాపాలకు దిగడమేంటని ఆయన ప్రశ్నించారు. తీరు మార్చుకోకుంటే మీ దారి మీరు చూసుకోండి.. నా దారి నేను చేసుకుంటా అని ఆయన హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అధికారులు రంగంలోకి దిగి అనధికారిక లేఔట్లను కట్టడి చేస్తే ప్రయోజనంగా ఉంటుంది.

నా దృష్టికి తీసుకురండి

పుంగనూరు మండల పరిధిలో ఎక్కడైనా అక్రమ లేఔట్లు ఉంటే.. ఎవరైనా నా దృష్టికి తీసుకురావచ్ఛు వాటిని పరిశీలించి.. నిజమని తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. స్థానిక పంచాయతీ అధికారుల బాధ్యత కూడా ఇందులో ఉంటుంది.- వెంకట్రాయులు, తహసీల్దారు, పుంగనూరు

ఇదీ చదవండి:

తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు నిలువరించండి: కేంద్రానికి రాష్ట్ర జలవనరుల శాఖ లేఖ

ABOUT THE AUTHOR

...view details