చిత్తూరు జిల్లా గుడిపాల మండలం, ఏఎల్‌పురం వద్ద బుధవారం రాత్రి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై.. వైకాపా శ్రేణులు దాడి చేశారు. ఏఎల్‌పురం గ్రామ సర్పంచ్‌గా గుర్రప్పనాయుడు గెలుపొందారు. మొక్కు చెల్లించేందుకు కొందరు గ్రామస్థులతో కలిసి సత్యమ్మ దేవాలయానికి వెళ్లి తిరిగి వస్తున్నారు. మధ్యలో... వెంగమాంబాపురం, సీఎం కండిగ ఎస్సీ కాలనీలకు చెందిన వైకాపా వర్గీయులు సుమారు 50 మంది ట్రాక్టర్లలో వచ్చి వారిని అడ్డగించి కర్రలతో దాడి చేశారు.
ఈ దాడిలో ఓ కారు, నాలుగు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. దాడికి భయపడిన తెదేపా శ్రేణులు.. ఆయా వాహనాలు వదిలి భయంతో పరుగులు తీశారు. అనంతరం ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై ప్రసాద్ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సర్పంచ్ గుర్రప్ప నాయుడును తెదేపా ఎమ్మెల్సీ దొరబాబు పరామర్శించారు. వైకాపా నాయకుల దాడిని దొరబాబు ఖండించారు.