YS Jagan allegatons on Chandrababu Naidu: చంద్రబాబు పాలనలో ప్రభుత్వరంగ, సహకార రంగంలో 54 పరిశ్రమలను మూతవేయడం, విక్రయించడం ద్వారా కార్మికులను, రైతులను రోడ్డున పడేస్తే...తాము అధికారంలోకి వచ్చాక సహకార రంగ అభివృద్ధికి చర్యలు తీసుకొంటున్నామని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. పాల ఉత్పత్తిదారు సంస్థ అమూల్ సహకారంతో 387 కోట్ల రూపాయలతో నిర్మించనున్న అమూల్ చిత్తూరు డైరీ నిర్మాణానికి భూమిపూజ, చిత్తూరు నగరశివారలో మూడువందల పడకలతో నిర్మించనున్న సీఎంసీ ఆసుపత్రికి సీఎం శంకుస్థాపన చేశారు. అమూల్ చిత్తూరు డైరీ పునరుద్ధరణ ద్వారా రెండు లక్షల మంది పాడి రైతులకు లబ్ధి చేకూరుతుందని వెల్లడించారు.రెండు వేల మందికి ప్రత్యక్షంగా 20 వేల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని సీఎం జగన్ పేర్కొన్నారు.
గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా 20 ఏళ్లుగా మూతబడిన చిత్తూరు డెయిరీ బకాయిలు 182 కోట్ల రూపాయలను తీర్చడంతో పాటు అమూల్ సంస్ధతో ఒప్పందం చేసుకుని 385 కోట్ల రూపాయల పెట్టబడితో డైరీ పునరుద్ధణకు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. చిత్తూరు నగర్ శివారులో డైరీ నిర్మాణానికి భూమిపూజ చేసిన అనంతరం పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. చిత్తూరు డెయిరీని 2002లో కుట్రపూర్వకంగా మూసేశారని.. 2.50లక్షల నుంచి 3లక్షల లీటర్ల పాలను ప్రాసెస్ చేస్తున్న డైరీని ఒక పథకం ప్రకారం కుట్రతో నష్టాల్లోకి నెట్టేశారని ఆరోపించారు. డైరీ మూసేయడంతో రైతులకు, ఉద్యోగులకు వందల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారని జగన్ విమర్శించారు.