చుట్టూ సమస్యలే అయితే ఏం చేస్తాం. ఏంటో ఈ జీవితం అనుకుంటాం. ఎప్పటికి తీరునో అని దేవుడికి దండం పెడతాం. కానీ ఓ యువకుడు మాత్రం సమస్యల నుంచి దారులు కనుక్కున్నాడు. చదివింది ఏడో తరగతే అయినా.. ఆవిష్కర్తగా తయారయ్యాడు. 30 ఆవిష్కరణలు చేసి.. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం చేతుల మీదుగా అవార్డు తీసుకున్నాడు.
చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలోని ఓ చిన్న గ్రామం మొరం. ఆ గ్రామంలో పవన్ అనే యువకుడు ఏడో తరగతితో చదువు ఆపేసాడు. తర్వాత దూరవిద్యలో డిగ్రీ పూర్తి చేశాడు. ఎప్పుడూ ఏదో ఒకటి చేయాలనే తపన అతడిది. తన చుట్టూ ఉన్న సమస్యలు, తన స్నేహితులకు ఎదురైన సమస్యలకు పరిష్కారం చూపే విధంగా ఆలోచించేవాడు. అలా ఇప్పటి వరకు సుమారు 30 ఆవిష్కరణలు చేశాడు పవన్. పలు అవార్డులు, రివార్డులు పొందాడు.