YCP leaders pelted stones on TDP Activists: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో అధికార వైకాపా కార్యకర్తలు రెచ్చిపోయారు. సోమల మండలం నజంపేటలో పోలీసుల సమక్షంలోనే ప్రతిపక్ష తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తెలుగుదేశం కార్యకర్తలు గాయపడ్డారు. అనేక వాహనాల అద్దాలు పగిలాయి. వైకాపా అరాచకంపై తెలుగుదేశం కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులతో భయపెట్టాలనుకుంటే కుదరదని, ఇలాంటి వాటికి బెదిరేది లేదని తేల్చిచెప్పారు. అధికార పార్టీ తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఈ క్రమంలో నజంపేటలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
"ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి" కార్యక్రమం నిర్వహణకు.. తెలుగుదేశం నియోజకవర్గ ఇన్‌ఛార్జి చల్లా రామచంద్రారెడ్డితోపాటు కార్యకర్తలు తొలుత సోమల హరిజనవాడకు వెళ్లారు. కార్యక్రమం నిర్వహణకు వీల్లేదంటూ వైకాపా శ్రేణులు రోడ్డుపై బైఠాయించడంతో.. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే జోక్యం చేసుకున్న పోలీసులు నిరసనను వాయిదా వేసుకోవాలని తెలుగుదేశం నాయకులను కోరారు. వారి సూచన మేరకు తమ కార్యక్రమాన్ని నజంపేటకు మార్చుకున్నారు. అక్కడికి వెళ్లగానే తెలుగుదేశం నాయకులపై వైకాపా కార్యకర్తలు రాళ్ల దాడితో చెలరేగిపోయారు. దాడి చేసిన వారిని అదుపు చేయాల్సిన పోలీసులు.. ఘటనను నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించిన తెలుగుదేశం నాయకులను గ్రామం నుంచి బలవంతంగా తరలించారు.