రెచ్చిపోయిన వైకాపా శ్రేణులు... ప్రేక్షకపాత్ర వహించిన పోలీసులు ఎవరికీ అనుమానం రాకుండా ముందు గుంపులో కలిసిపోతారు. సరైన అవకాశం కోసం చూస్తారు. ప్రత్యర్థి అభ్యర్థుల నామినేషన్ అని తేలగానే గుంపుగా దాడి చేస్తారు. నామినేషన్ పత్రాలు పట్టుకుని పరుగో పరుగు అంటారు. ప్రత్యర్థులెవరూ నామినేషన్ వేయకుండా ఉండేందుకు... చిత్తూరు జిల్లా పుంగనూరు ఎంపీడీవో కార్యాలయం కేంద్రంగా నడిచిన అధికార పార్టీ అరాచకాలకు ప్రత్యక్ష ఉదాహరణ ఇది.
ప్రత్యర్థులను ముందుగానే బెదిరించడం... మాట వినకుంటే కార్యాలయం ముందే దాడులకు దిగడం వైకాపా రచించిన వ్యూహమిది. ఎలాగో వీరి బారి నుంచి తప్పించుకుని కార్యాలయంలోకి వెళ్లినా అధికారి టేబుల్ పైనుంచే నామపత్రాలు లాక్కెళ్లి చించివేయడం వైకాపా నేతల దాష్టీకానికి పరాకాష్ఠ. అక్కడే ఉన్న పోలీసులూ సినిమా చూస్తున్నట్లు కళ్లప్పగించి చూస్తున్నారే తప్ప... కనీసం అడ్డుకునే సాహసం చేయడం లేదు.
ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను వైకాపా నేతలు అడ్డుకోవడంతో ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసులు గేట్లు మూసేయగా గోడలు దూకి నామినేషన్ దాఖలు చేసేందుకు తెదేపా, జనసేన కార్యకర్తలు యత్నించారు. పుంగనూరు నియోజకవర్గంలో నామినేషన్లు వేయనీయకుండా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గం అడ్డుకుందని స్వతంత్ర అభ్యర్థి రామచంద్ర యాదవ్ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. దాడులపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. పుంగనూరులో ఎన్నికలను తాత్కాలికంగా నిలిపివేసి ప్రశాంత వాతావరణం ఏర్పడ్డాకే నిర్వహించాలని గవర్నర్‌ను కోరామన్నారు.
పుంగనూరులో మాత్రమే కాకుండా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వైకాపా శ్రేణుల ఆగడాలు శృతిమించాయి. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నియోజకవర్గం చంద్రగిరిలో, ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి నియోజకవర్గం గంగాధర నెల్లూరులో వైకాపా నాయకులు తమ ప్రతాపం చూపారు. రామచంద్రాపురం, కార్వేటి నగరంలో తెదేపా ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలను లాక్కుని చింపేశారు. చౌడేపల్లి మండలంలో, తిరుపతి రూరల్ ఎంపీడీవో కార్యాలయంలో, చెర్లోపల్లిలోనూ వైకాపా శ్రేణుల ఆగడాలు మితిమీరాయి. చంద్రగిరి నియోజకవర్గంలోని డోర్నకంబాలలో రిటర్నింగ్ అధికారి ఎదుటే వైకాపా కార్యకర్తలు... తెదేపా అభ్యర్థుల నామినేషన్ పత్రాలను లాక్కుని పరారయ్యారు.
ఇదీ చదవండీ... పల్నాడులో కర్రలు, కత్తుల స్వైరవిహారం