ప్రతిపక్ష అభ్యర్థుల నామినేషన్లు చింపేసిన వైకాపా నేతలు గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం బోయలవీడు ఎంపీటీసీ స్థానానికి తెదేపా తరఫున నామినేషన్ వేసేందుకు వెళ్తున్న తనపై... వైకాపా కార్యకర్తలు దాడి చేశారని నాగేంద్రం అనే మహిళ ఆరోపించారు. తన దరఖాస్తును ఎంపీడీవో పరిశీలిస్తున్న సమయంలో వైకాపా నేతలు అక్కడికొచ్చి లాకున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులు పట్టించుకోకపోవటంపై తెదేపా నేతలు విమర్శిస్తున్నారు. నామినేషన్ వేయకుండా కదిలేదిలేదని ఎంపీడీవో కార్యాలయం వద్దే బైఠాయించారు.
కర్నూలు జిల్లాలో నామినేషన్లు వేసేందుకు వెళ్తున్న తమపై అధికార పార్టీ నేతలు దాడులు దిగుతున్నారని... తెదేపా నాయకులు ఆరోపించారు. మంత్రాలయం మండలం బూదురు ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు మునెమ్మ ఆటోలో బయల్దేరగా... వెనుకనే మరో ఆటోలో వెళ్తున్న తెదేపా కార్యకర్తలపై వైకాపా వర్గీయులు దాడి చేశారని చెబుతున్నారు. ఈ ఘటనలో ఓ కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చిప్పగిరి ఎంపీటీసీ స్థానానికి నామినేషన్ వేసేందుకు వెళ్తుండగా... తనపై మంత్రి గుమ్మనూరు జయరాం అనుచరులు దాడి చేసి నామపత్రాలు చింపేశారని రజనీ ఆరోపించారు. ఈ ఘటనపై తెదేపా నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
స్థానికసమరంలో విజయం తప్పక సాధించాలని ముఖ్యమంత్రే మంత్రులకు లక్ష్యాలు విధించటంతో వారి అనుచరులు అరాచకాలకు పాల్పడుతున్నారని.... భాజపా రాష్ట్ర కార్యదర్శి భానుప్రకాశ్‌రెడ్డి మండిపడ్డారు. పుంగనూరు నియోజకవర్గం పులిచర్ల మండలంలో భాజపా నేతలపై వైకాపా శ్రేణులు చేసిన దాడిని ఆయన ఖండించారు. దాడి చేసిన వారిలో వైకాపా అభ్యర్థి ఉన్నారని ఆరోపించారు. అతని నామినేషన్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
పులిచర్ల మండలం కావేటిగారిపల్లి పంచాయతీ కార్యదర్శి... స్థానిక తెదేపా నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఎంపీటీసీ స్థానానికి నామినేషన్ వేయడానికి వచ్చిన తెదేపా అభ్యర్థి... తన ఇంటి పన్ను కట్టించుకోవాలని అధికారులను కోరగా వారు నిరాకరించారు. ఈ కారణంగా వాగ్వాదం మొదలైంది. ఇంటిపన్ను చెల్లించని పక్షంలో నామినేషన్ దాఖలు చేసే అవకాశం లేదు. వైకాపా ప్రోద్బలంతో ఇతర పార్టీల అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకునేందుకు పంచాయతీ కార్యదర్శి ప్రయత్నిస్తున్నారంటూ తెదేపా నాయకులు ఆరోపించారు. కార్యాలయం వద్దే ఆందోళన చేపట్టారు.
ఇదీ చదవండీ... తెదేపా తరఫున రాజ్యసభ అభ్యర్థిగా వర్ల రామయ్య