YCP Activist Attack On SCs: చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం బోయకొండ క్రాస్‌లో అధికార పార్టీ కార్యకర్త, ఆయన కుటుంబసభ్యులు, అనుచరులు ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తులపై దాష్టీకానికి పాల్పడ్డారు. మహిళలని కూడా చూడకుండా జుట్టు పట్టుకుని కాళ్లతో తన్ని కర్రలతో వారిపై దాడికి దిగడంతోపాటు కులం పేరుతో దూషించారు. బాధిత కుటుంబానికి చెందిన సమీర అనే బాలిక ఈ దౌర్జన్యాన్ని ఫోన్‌లో వీడియో తీస్తుండగా ఫోన్ లాక్కుని పగలగొట్టారు. దివ్యాంగుడైన నాగేంద్ర అనే వ్యక్తి వేళ్లు విరిచేశారు.
దిగువపల్లి పంచాయతీకి చెందిన శ్రీనివాసులుకు బోయకొండ క్రాస్‌లో 2.82 ఎకరాలు, ఆయన తండ్రి పాలెం నారాయణ పేరిట మరో 1.60 ఎకరాల ఎసైన్డ్ భూమి ఉంది. ఆ పక్కనే వైసీపీ కార్యకర్త అయిన ఆవుల కృష్ణమూర్తికి కొంత భూమి ఉంది. ఇటీవల కృష్ణమూర్తి కుటుంబీకులతో పాటు మరికొందరు... శ్రీనివాసులు, నారాయణ భూమిలో కొంత భాగానికి బోగస్ పట్టాలు సృష్టించారు. మంగళవారం ఉదయం కృష్ణమూర్తి, ఆయన భార్య నరసమ్మ, కుమారులు గణపతి, మహేష్, ప్రసాద్, కోడలు శిల్పతోపాటు సుమారు 40 మంది మద్దతుదారులు అక్కడ రాతి స్తంభాలు నాటడానికి వచ్చారు. ఈ భూమి తమదంటూ శ్రీనివాసులు, ఆయన కుటుంబసభ్యులతో వివాదానికి దిగి దాడి చేశారు.