ఒకటి రెండు దశాబ్దాల క్రితం వరకూ ఆడపిల్లకు చదువనే అంశం ఓ మిథ్య. మహా అయితే పదో, ఇంటర్.. అంతే అంతటితో చదువుకు స్వస్తి చెప్పాల్సిందే. వివాహం పేరుతోనో.. మరేదో కారణంతోనో మహిళలు ఇంటికి పరిమితం కావాల్సిన పరిస్థితులుండేవి. కంప్యూటర్ యుగం ప్రారంభమైనప్పటి నుంచి పరిస్థితుల్లో మార్పులు రావటం ప్రారంభమయ్యాయి. అత్యాధునిక సాంకేతికత మనిషి జీవితంపై లోతైన ప్రభావాన్ని చూపించింది. మార్కెట్ లో అవసరాలకు సరిపడా మానవవనరులు లేకపోవటం.. యంత్రాలపై ఆధారపడటానికి కారణమైంది. ఫలితం స్త్రీపురుష బేధం లేకుండా అందరికీ సమాన అవకాశాలు.. జీతభత్యాలు కల్పించాల్సి రావటం అనివార్యమైంది. ఒకప్పుడు వంటింటికే పరిమితమైపోయిన స్త్రీ.. నేడు పురుషుడితో సమానంగా ఉన్నత విద్యలను అభ్యసిస్తూ అన్ని రంగాల్లోనూ పైచేయి సాధిస్తోంది. ఇటీవలి కాలంలో దేశంలో విద్యారంగంలో నమోదైన గణంకాలు ఈ పరిస్థితులన్నింటినీ కళ్లకు కడుతున్నాయి.
మహిళలు కనబరుస్తున్న ఆసక్తే కొత్త కోర్సుల రూపకల్పనకు నాంది..
నేషనల్ సర్వే ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్.. దేశంలో ఉన్నత విద్యకు సంబంధించి గణాంకాలను అందించే బాధ్యత.. ఈ విభాగానిదే. గడచిన ఏడేళ్ల కాలంలో ఈ సర్వేలో నమోదైన గణాంకాలు.. ఉన్నత విద్యార్హతలు సాధించే దిశగా మహిళల్లో వచ్చిన చైతన్యాన్ని ప్రస్ఫుటం చేస్తున్నాయి. పాఠశాల, ఇంటర్మీడియట్ స్థాయిని దాటుకొని.. అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆపై చదువుల్లో మహిళల చూపిస్తున్న జోరును స్పష్టం చేస్తున్నాయి.