Wife And Husband Cheating People With Chits చిత్తూరు జిల్లా పలమనేరులో చిట్టీ పేరుతో అమాయకుల వద్ద సుమారు పది కోట్ల రూపాయలు కొల్లగొట్టి.. రాత్రికి రాత్రే ఊరి నుంచి ఉడాయించాడో వ్యక్తి. కష్టపడి దాచిపెట్టుకున్న సొమ్ముంతా దోచుకుని పోవటంతో.. బాధితులు లబోదిబోమంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
బాధితులకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని కీలపట్ల పంచాయతీ నలసానిపల్లె గ్రామానికి చెందిన శంకరయ్య గత కొంత కాలంగా పలమనేరు పట్టణం బజారు వీధిలో అద్దెకు ఉంటూ చీట్టీలను నిర్వహించేవాడు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అతడు.. ప్రతి నెలా రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు చిట్టీలను నిర్వహించేవాడు. అతడికి తన గ్రామంలో, పలమనేరు పట్టణంలోనూ సొంత భవనాలు ఉండటంతో చాలా మంది అమాయకులు, నమ్మకంతో శంకరయ్య వద్ద చిట్టీలు వేశారు. నలసానిపల్లె, పలమనేరు, తమ్మిరెడ్డిపల్లె, గ్రామాల వారే కాక కర్ణాటక రాష్ట్రానికి చెందిన మరికొంతమంది కూడా చిట్టీలు వేశారు.
ఇటీవల కాలంలో.. చిట్టీల గడువు పూర్తి అయినా కూడా డబ్బులు ఇవ్వకుండా, నెలలు తరబడి తిప్పుకుంటూ కాలయాపన చేసేవాడని బాధితులు తెలిపారు. ఈ క్రమంలో రాత్రికి రాత్రే తమ సొమ్మంతా తీసుకుని పిల్లలతో సహా అక్కడి నుంచి ఉడాయించాడంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించారు. తమ పిల్లల భవిష్యత్తు కోసం కూడబెట్టుకొని చిట్టీలు కట్టగా, అతడు ఇలా చేశాడంటూ.. బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. కాగా, నిర్వాహకుడు శంకరయ్య తన ఆస్తులను రెండు నెలల క్రితమే అతడి బంధువుల పేరుపై రాయించినట్లు బాధితులు ఆరోపించారు. బాధితుల నుంచి ఫిర్యాదులు అందుకున్న పోలీసులు గత నెల రోజులుగా నిందితుడు శంకరయ్య కోసం గాలిస్తున్నట్లు ఎస్సై ప్రతాప్ రెడ్డి తెలిపారు.
"శంకరయ్య, అతడి భార్య జ్యోతి చట్ట విరుద్ధంగా చిట్టీలు రన్ చేస్తున్నారు. గత కొంతకాలంగా వీళ్లు.. రూ.5 లక్షలు, రూ.10 లక్షలు చిట్టీలు కట్టించుకుని.. బాధితుల డబ్బును తీసుకుని ఉడాయించారు. దీనిపై బాధితుల నుంచి మాకు ఫిర్యాదులు అందాయి. మేము ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టాము. ప్రస్తుతం శంకరయ్య, అతడి భార్య పరారీలో ఉన్నారు. వారిద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టాము. నిందితులను పట్టుకున్న తర్వాత.. చట్టపరంగా చర్యలు తీసుకుంటాము." - ప్రతాప్ రెడ్డి, ఎస్సై
"నా పేరు సాంబశివరావు. ఇక్కడ శంకరయ్య పది లక్షల రూపాయల చిట్టీ ఓపెన్ చేశామని చెప్పారు. మా వద్ద డబ్బులు కట్టించుకున్నారు. మేము కష్టపడిన డబ్బునంతా ఆయన వద్ద చిట్టీలుగా కట్టాము. నేను దివ్యాంగుడిని. నా పింఛను డబ్బును కూడా అతడికే కట్టాను. ఇప్పుడు మా సొమ్మంతా తీసుకుని రాత్రికి రాత్రే.. భార్య, పిల్లలతో ఉడాయించాడు. దీనిపై మేము పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశాము."- సాంబశివరావు, బాధితుడు
చిట్టీల పేరుతో కోట్లకు కుచ్చుటోపి