చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం సమీపంలో 2010 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం అమర రాజా ఇన్ఫ్రాకు కేటాయించిన భూములను తిరిగి స్వాధీనంచేసుకొంటున్నట్లు తమకు ఎలాంటి అధికారిక ఉత్తర్వులు అందలేదని ఆ సంస్థ ప్రకటించింది. అమర రాజా గ్రూపు కార్పొరేట్ కమ్యూనికేషన్స్ పేరుతో విడుదలైన ప్రకటనలో పలు అంశాలను వెల్లడించింది.
భూముల స్వాధీనంపై అధికారిక సమాచారం లేదు: అమరరాజా - భూముల రద్దుపై అమర రాజా స్పందన
అమరరాజా ఇన్‌ఫ్రాటెక్ (ప్రైవేట్) సంస్థకు వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో కేటాయించిన 253.6 ఎకరాల్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుందని ఇటీవల వార్తలు వచ్చాయి. దీనిపై అమరరాజా సంస్థ స్పందించింది. తమకు అధికారిక సమాచారం అందలేదని వెల్లడించింది.
'భూములను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకొంటున్నట్లు ప్రసార మాధ్యమాలు, సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం మాత్రమే మాకు తెలుసు. ఈ అంశంపై అధికారికంగా సమాచారం మాకు రాలేదు. అమరరాజా సంస్థ ప్రారంభం నుంచి స్థానికంగా ఉపాధి అవకాశాలు, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే లక్ష్యంగా పనిచేస్తోంది. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాం' అని ప్రకటనలో వివరించారు. అమరరాజా సంస్థ నీతి, నైతికతకు కట్టుబడి ఉందని.. సామాజిక ప్రయోజనాల కోసం కృషి చేస్తోందని పేర్కొన్నారు.