CBN Connect programme updates: అభివృద్ధి పరంగా ఇతర రాష్ట్రాలతో పోటీపడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.. ఇవాళ మనుగడ కోసం పోరాడాల్సిన పరిస్థితికి చేరుకుందని.. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. 'సీబీఎన్ కనెక్ట్ కార్యక్రమం' ద్వారా ఆయన ఈరోజు రాష్ట్రంలోని నిరుద్యోగులతో, డాక్టర్లతో, లాయర్లతో, టీచర్లతో వర్చువల్‌గా సమావేశాలు నిర్వహించి.. ఈ నెల 13వ తేదీన జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించిన విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు.
ప్రైవేటు టీచర్లకు గౌరవం తీసుకొస్తాం: ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ..''ఒకప్పుడు అభివృద్ధిలో పోటీపడిన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.. నేడు మనుగడ కోసం పోరాడాల్సి రావడం చాలా బాధాకరం. భావితరాల భవిష్యత్తు కోసం సమష్టిగా పోరాడాల్సిన అవసరం మనందరిపైనా ఉంది. శాసన మండలిలో ఉపాధ్యాయ సమస్యలపై పోరాడే వారికే ఓటేయండి. ఒక్కో టీచర్‌కు రూ.5వేలు ఇచ్చి కొనుగోలు చేసేందుకు ఈ ప్రభుత్వం సిద్ధపడుతోంది. అవినీతి డబ్బుతో ఉపాధ్యాయ ఓట్లను కొనేందుకు వైసీపీ నాయకులు సిద్ధమయ్యారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పోటీలో లేకపోయినా, ఉపాధ్యాయుల భవిష్యత్తు కోసం హెచ్చరిస్తున్నా.. వైసీపీ అభ్యర్థులకు ఓటేస్తే, మీ జీవితాలకు మీరే ఉరితాళ్లు బిగించుకున్నట్లే. ఎన్నికలయ్యాక మీ జీతాల్లో కోత పెట్టడంతో పాటు ఇతరత్రా అన్ని సౌకర్యాలు లేకుండా చేస్తారు. అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని ప్రైవేటు టీచర్లనూ గౌరవించేలా తెలుగుదేశం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇస్తున్నా. ఎందరో విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దుతున్న టీచర్లకు ఈరోజు గౌరవం లేకుండా పోయింది. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా పతనమైపోయింది. రాష్ట్రంలో ఆర్థిక అసమానతలను తొలిగించే వ్యవస్థకు శ్రీకారం చుట్టి, పేదరికం లేని కుటుంబ స్థాపన చేయడమే టీడీపీ లక్ష్యం.'' అని ఆయన అన్నారు.
వైసీపీ 30శాతం దొంగ ఓట్లను చేర్చింది:పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ 30శాతం దొంగ ఓట్లను చేర్చిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోపించారు. సమాజంలో చీడపురుగులకు గుణపాఠం చెప్పకపోతే వివేకానంద రెడ్డిని చంపినట్లుగా, ఇంకా రెచ్చిపోతారని ఆయన దుయ్యబట్టారు. వివేకానంద రెడ్డిని చంపి ఎన్ని విన్యాశాలు చేస్తున్నారో రాష్ట్ర ప్రజలు చూస్తున్నారని గుర్తు చేశారు. వివేకానంద రెడ్డిని వాళ్లే చంపి.. ఆ హత్యను ఊరందరి మీద వేసి, తప్పించుకోవటానికి ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతారా? అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధపడుతూ చనిపోవటం కంటే, ఐక్యంగా పోరాటం చేయడమే మేలని అన్నారు. ఈ విషయాన్నీ పట్టభద్రులంతా గుర్తుపెట్టుకోని..పోలింగ్ రోజున ఓటుతో సమాధానం చెప్పాలని సూచించారు.