చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని కల్యాణి డ్యాంకు వరదనీరు పోటెత్తింది. ప్రస్తుత నీటిమట్టం 895 అడుగులు ఉంది. మరో 5 అడుగుల మేర నీరు చేరితే డ్యాం గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.
నివర్, బురేవి తుపానుల ధాటికి శేషాచల అటవీ ప్రాంతం నుంచి వరద నీరు పోటెత్తోంది. ఇన్-ఫ్లో క్రమంగా పెరుగుతోంది. తిరుపతికి తెలుగుగంగ నీటి పంపింగ్ నిలిపిన అధికారులు కల్యాణి డ్యామ్ నీటిని ఎక్కువగా తిరుపతికి పంపింగ్ చేస్తున్నారు. డ్యామ్‌కు ప్రమాదం జరగకుండా ఏ క్షణాన్నయినా గేట్లు ఎత్తేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇరిగేషన్, రెవెన్యూ, పోలీసులు, మండల అధికారులు డ్యామ్ వద్ద పరిస్థితిని పరిశీలిస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని గ్రామ వాలంటీర్లకు సూచించారు. స్వర్ణముఖి పరివాహక ప్రాంతాలకు పశువుల కాపరులు వెళ్లవద్దంటూ ఆదేశించారు.