VOLUNTEERS IN ELECTION CAMPAIGN: హైకోర్టు ఆదేశాలు బేఖాతరు.. వాలంటీర్లు ఏం చేస్తున్నారంటే?!
వాలంటీర్లను హైకోర్టు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంచాలని చెప్పినప్పటికీ.. గుంటూరు, చిత్తూరులలో వారు ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటున్నారు. ఓ చోట కరపత్రాలు పంచుతూ.. మరోచోట ప్రచారానికి ఎవరెవరు వచ్చారనే వివరాలను నమోదు చేసుకుంటూ కనిపించారు.
హైకోర్టు వద్దంటున్నా.. వాలంటీర్లు వెళ్తున్నారు..!
By
Published : Nov 12, 2021, 6:53 AM IST
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురువారం కుప్పంలో ఎన్నికల ప్రచారం చేశారు. వాలంటీర్లు దగ్గరుండి ఈ ప్రచారాన్ని పర్యవేక్షించారు. ఎంతమంది మహిళలు పాల్గొన్నారు? వారి పేర్లు అన్ని వివరాలు పరిశీలించుకొని సెల్‌ఫోన్‌లలో నమోదు చేసుకున్నారు.
వాలంటీర్లు పంపిణీ చేస్తున్న కరపత్రం
వైకాపా కేంద్ర కార్యాలయం నుంచి వచ్చినట్లు చెబుతున్న కరపత్రాలను వాలంటీర్ల ఇల్లిల్లూ తిరుగుతూ పంపిణీ చేయడం చర్చనీయాంశమైంది. గుంటూరు జిల్లా గురజాల నగర పంచాయతీ ఒకటో వార్డులో ‘అక్కాచెల్లెమ్మలకు, అన్నదమ్ములకు ఆత్మీయంగా మీ జగన్ రాస్తున్న ఉత్తరం’ పేరిట కరపత్రాలను వాలంటీర్లు అందించారు. అందులో వైకాపా ప్రభుత్వం చేసిన పథకాల ప్రయోజనాలు వివరించారు. వ్యక్తిగతంగా ఏ కుటుంబం ఏ మేరకు లబ్ధి పొందిందో ప్రస్తావిస్తూ.. ఓటర్ల పేరుతోనే కరపత్రాలు ముద్రించారు. వాలంటీర్లను ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంచాలని హైకోర్టు ఇప్పటికే ఆదేశాలిచ్చిన విషయం ప్రస్తావనార్హం.