చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం భీమవరం గ్రామ పంచాయతీలోని కూచువారిపల్లి ఎస్టీ కాలనీ వాలంటీర్ మహేశ్‌కి సెక్రటరీ గిరిబాబు రెండు రోజుల క్రితం మెమో జారీ చేశారు. దీంతో గ్రామస్థులంతా ఏకమై సచివాలయాన్ని ముట్టడించారు. తమ వాలంటీర్ మహేశ్ ఎవరికి ఏ అవసరం వచ్చినా ముందుంటాడని అలాంటి వాలంటీర్‌ని తొలగించేందుకు సెక్రటరీ కుట్ర పన్నుతున్నాడని ఆరోపించారు. తమకు వాలంటీర్‌గా మహేశ్నే కొనసాగించాలని సచివాలయం ముందు నిరసన చేపట్టారు. సమస్యను పరిష్కరించకుంటే గ్రామస్థులతో కలసి ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఆందోళన చేపడతామని గ్రామస్థులు అన్నారు.
గత ఏడాది కొండ్రెడ్డి కండ్రిగ చెరువు చేపల వేలం వేయకుండా తనకు అనుకూలమైన వారికి అప్పగించడాన్ని ప్రశ్నించడంతో నాపై సెక్రటరీ కక్ష కట్టాడు. ఆరోగ్య సమస్య కారణంగా వారం రోజులు డ్యూటీకి పోలేకపోయా. దీంతో మెమో జారీ చేశారు. ఇంత మంది గ్రామస్తులు వచ్చి చెప్పినా సెక్రటరీ వినడం లేదు. -వాలంటీర్ మహేశ్
ఈ పరిణామాలపై సెక్రటరీ గిరిబాబు స్పందించారు. విధులకు సక్రమంగా హాజరుకాకపోవడంతోనే మెమో జారీ చేశామని సెక్రటరీ వివరణ ఇచ్చారు. ఎంపీడీవో ఆదేశాలతో తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.