చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో 3 వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రెండు కోట్ల సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్రం ఆమోదించిన వ్యవసాయ బిల్లులు.. రైతుల నడ్డి విరిచే విధంగా ఉన్నాయని డీసీసీ జిల్లా అధ్యక్షుడు సురేష్ బాబు అన్నారు. కేవలం కేసుల భయంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి వాటిని వ్యతిరేకించకపోగా... వారితో కుమ్మక్కయ్యారని ఆరోపించారు.
గంగాధర నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే నారాయణ స్వామి ఉపముఖ్యమంత్రి హోదాలో ఉండి... రైతులకు జరుగుతన్న నష్టాన్ని పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. వెంటనే ఆయన తన పదవికి రాజీనామా చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నియోజకవర్గ బాధ్యులు డాక్టర్ నర్సింహులు మహిళల చేత సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చవటగుంట కూడలిలోని అంబేడ్కర్, వైఎస్సార్ విగ్రహాలకు నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు.