వైకుంఠ ద్వార దర్శనం ఉండే రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా సేకరించే వర్ణరంజిత పత్ర, పుష్ప, ఫలాలతో, ప్రకృతి రమణీయ అలంకరణతో ఆలయం ఇల వైకుంఠాన్ని తలపిస్తుంది. స్వర్ణ రథోత్సవం ప్రత్యేకతగా నిలుస్తుంది.
కలియుగ దైవం తిరుమలేశుడిని వైకుంఠ ద్వారం నుంచి వెళ్లి దర్శించుకోవడాన్ని భక్తకోటి ఉత్తమోత్తమంగా భావిస్తుంది. ఏటా ముక్కోటి ఏకాదశి, ద్వాదశి రోజుల్లో మాత్రమే ఈ మార్గం తెరిచి ఉంటుంది. ఆ రెండు రోజుల్లో స్వామివారిని దర్శించుకునేందుకు మూణ్నాలుగు లక్షల మంది తిరుమలకు చేరుకున్నా.. ఆలయ ప్రవేశం లభించేది గరిష్ఠంగా రెండు లక్షల మందికే. మిగిలిన వారంతా మరుసటి రోజుల్లో సాధారణ దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణమయ్యేవారు.ఈ సంప్రదాయాన్ని మారుస్తూ ఇకపై 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరవాలని తితిదే నిర్ణయించింది. అదే సమయంలో, వైష్ణవ ఆచారాలకు కేంద్రంగా భావించే తమిళనాడులోని శ్రీరంగం ఆలయంలో మాదిరిగా ఇక్కడా పది రోజులు అధ్యయనోత్సవాలు నిర్వహించనుంది. డిసెంబరు 25న ముక్కోటి ఏకాదశి నుంచి జనవరి 3న పంచమి వరకు వైకుంఠ ప్రదక్షిణలో భక్తులను అనుమతించనుంది.
తిరుమలలో ఉత్తర ద్వార ప్రదక్షిణ
దేశవ్యాప్తంగా ఉన్న 108 శ్రీ వైష్ణవ దివ్య క్షేత్రాల్లో మూలవిరాట్‌కు ఉత్తరం వైపున వైకుంఠ ద్వారం ఉంటుంది. వైష్ణవ సంప్రదాయాలకు నెలవైన శ్రీరంగం, నాచియార్ కోయిల్, పార్థన్‌పల్లి, తిరుచ్చిరాయ్, తిరునగయ్ ఆలయాల్లో ముక్కోటి ఏకాదశి నుంచి 10 రోజుల పాటు ఉత్తరం వైపున ఉన్న వైకుంఠ ద్వారాలు తెరిచి ఉత్సవమూర్తులను ఈ మార్గంలోనే తీసుకెళ్తారు. భక్తులనూ అనుమతిస్తారు. కొన్ని ఆలయాల్లో ఈ ద్వారం మహద్వారం లేదా ఇతర చోట్ల నిర్మించారు. తిరుమలలో కొంత వైవిధ్యం. ఇక్కడ 12, 13 శతాబ్దాల్లో వేంకటేశ్వర స్వామివారి గర్భగుడికి అనుసంధానంగా మరో గోడ కట్టారు. తర్వాత మూడో ప్రాకారం నిర్మించారు. గర్భగుడికి.. రెండు, మూడు ప్రాకారాల నడుమ సన్నని సందు ఏర్పడింది. తర్వాతి కాలంలో ఇదే ముక్కోటి ప్రదక్షిణ ద్వారంగా పేరుగాంచింది. దక్షిణం వైపు నుంచి ప్రవేశించి, ఉత్తర దిక్కుగా ప్రదక్షిణ చేసి మూలమూర్తిని దర్శించుకుంటారు కాబట్టి.. ‘వైకుంఠ ప్రదక్షిణ’గా చెబుతున్నారు. ఈ మార్గం ఉత్సవమూర్తుల ప్రదక్షిణకు ఇరుగ్గా ఉన్నందున.. స్వామివారి ‘తోమాల పొట్టం’ను మాత్రమే ఊరేగిస్తున్నారు. శ్రీమహంత్ సేవాదాస్ విచారణకర్తగా ఉన్నప్పుడు 1843లో ఈ ద్వారాన్ని ఆధునికీకరించారు.
సమాంతరంగా అధ్యయనోత్సవాలు
వైష్ణవ ఆలయాల్లో స్థానిక ఆచారాన్ని బట్టి ఏటా 21 నుంచి 25 రోజులపాటు అధ్యయనోత్సవాలు నిర్వహిస్తారు. వైకుంఠ ఏకాదశికి ముందు 11 రోజులను పగల్‌పత్తుగా, ఏకాదశి నుంచి తర్వాతి 10 రోజులను రాత్‌పత్తుగా పిలుస్తారు. ఈ సమయంలో దివ్య ప్రబంధంలోని 4వేల పాశురాలను పండితులు పఠిస్తుంటారు. తిరుమలలో 1493 నుంచి అధ్యయనోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ కార్తిక అమావాస్య నాడు మొదలై 25 రోజులపాటు కొనసాగుతాయి. తితిదే తాజా నిర్ణయం ప్రకారం.. రాత్‌పత్తు పఠించే పది రోజులూ భక్తులను వైకుంఠ ద్వారంలో అనుమతిస్తారు. ఎల్లప్ప పిళ్లై హయాంలో తొలుత ముక్కోటి ఏకాదశిని మూడు రోజులపాటు నిర్వహించారు. ఆ తర్వాత రెండు రోజులకు కుదించారు. ఈ రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా సేకరించే వర్ణరంజిత పత్ర, పుష్ప, ఫలాలతో, ప్రకృతి రమణీయ అలంకరణతో ఆలయం ఇల వైకుంఠాన్ని తలపిస్తుంది. స్వర్ణ రథోత్సవం ప్రత్యేకతగా నిలుస్తుంది.
ఇదీ.. గత అనుభవం
ఏటా ముక్కోటికి భక్తులు తిరుమలకు పోటెత్తడం వల్ల ముందురోజే కంపార్ట్‌మెంట్లు, తాత్కాలిక షెడ్లు నిండిపోయేవి. కల్యాణవేదిక దాటి గోగర్భం డ్యాం వరకు వరుసల్లో, చలిలో నిరీక్షించేవారు. తితిదే రూ.కోట్లు వెచ్చించి వీరికి ఆహారం, బస కల్పించాల్సి వచ్చేది. వీఐపీ బ్రేక్ దర్శనాలపై ఆంక్షలు విధించేవారు. ఎంత కసరత్తు చేసినా రెండు లక్షల మందికే దర్శనం లభించేది.