చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించి కరోనా టీకా రెండు డోసులలో వేర్వేరు కంపెనీ వ్యాక్సిన్లు వేయటం కలకలం రేపుతోంది. ఆదివారం నిర్వహించిన మెగా డ్రైవ్లో భాగంగా.. పెనుమూరు మండలం గుడ్యాణం పల్లెలో ఈ ఘటన చోటు చేసుకుంది. తొలి డోసు కోవిషీల్డ్ వేసిన వ్యక్తులకు... రెండో డోస్గా కోవాగ్జిన్ ఇచ్చారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆరోగ్య కార్యకర్త.. 30 మందికిపైగా ఇదే తరహాలో టీకా వేశారు.
తొలి డోసులో కొవీషీల్ట్ టీకా వేసిన విషయం వైద్య సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకుండా.. రెండో డోసులో కొవాగ్జిన్ టీకా వేశారని గ్రామస్థులు ఆరోపించారు. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న తీరును కొందరు గ్రామస్థులు మండల వైద్యాధికారి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన ఉన్నతాధికారులు తప్పిదాన్ని గుర్తించి టీకా వేయటాన్ని ఆపేశారు. అప్పటికే 30మందికి పైగా టీకాలు మార్చి వేసినట్లు గుర్తించారు. గ్రామానికి చేరుకున్న మండల వైద్యాధికారి టీకా మారటం ద్వారా ఇబ్బంది ఏమీ ఉండదని వ్యాక్సిన్ వేసుకున్న వారికి నచ్చజెప్పారు. మిగిలిన వారికి తొలిడోసులో వేసిన కంపెనీ టీకానే వేయించారు. వేర్వేరు టీకాలు తీసుకున్న వ్యక్తులు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని గ్రామస్థులు తెలిపారు.