COLLAPSE ARCH: లారీ డ్రైవర్ నిర్లక్ష్యం.. కూలిన తితిదే స్వాగత తోరణం - తిరుపతి ఆర్టీసీ బస్టాండ్

13:55 September 19
తప్పిన పెను ప్రమాదం
లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా తిరుపతిలో తితిదే స్వాగత తోరణం (collapse arch) కూలింది. నగరికి చెందిన ఓ లారీ.. ఆర్టీసీ బస్టాండ్ నుంచి రామానుజకూడలి వెళ్లే ప్రధాన రహదారిపై ప్రయాణిస్తోంది. టిప్పర్ వెనక బాడీ అమాంతంగా పైకి లేచిపోయింది. దానిని గమనించిన డ్రైవర్ అలాగే నడిపించాడు. కొంత దూరం వెళ్లాక దారిలో తితిదే ఏర్పాటు చేసిన హోర్డింగ్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో స్వాగత తోరణం కుప్పకూలిపోయింది. రహదారిపై ఎదురుగా వస్తున్న ఓ భక్తుడి కారుపై కూలిన తోరణం పడిపోయింది. అయితే కారులోని భక్తులకు ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
రోడ్డుకు ఇరువైపులా హోర్డింగ్ పడిపోవడంతో బస్టాండ్‌కు బస్సుల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. సుమారు మూడు గంటలపాటు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. దీంతో భక్తులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వెంటనే స్పందించిన పోలీసులు.. శ్రీనివాస సేతు నిర్మాణ సంస్థ ఆఫ్కాన్ సహకారంతో హోర్డింగ్ తొలగించి..పరిస్థితిని చక్కదిద్దారు.
ఇదీ చదవండి : తిరుమలలో వైభవంగా అనంతపద్మనాభస్వామి వ్రతం