కరోనా మహమ్మారి నియంత్రణ చర్యల్లో బాగంగా.. జిల్లా అధికారులకు సహకరించేలా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ(తుడా) ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు తుడా కార్యాలయంలో పాలకవర్గ సమావేశం నిర్వహించారు. జిల్లా అధికారులు, పాలకమండలి సభ్యులతో వర్చువల్ పద్ధతిలో సమావేశమైన ఆయన.. వైరస్ కట్టడి కోసం తుడా ఏ విధంగా భాగస్వామ్యం కావాలనే అంశంపై చర్చించారు. కొవిడ్ కేర్ సెంటర్ల నిర్వహణలో తుడా సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. ఇప్పటికే చంద్రగిరి, తిరుచానూరు పద్మావతి కొవిడ్ సెంటర్ల పనితీరు బాగుందన్న ఆయన.. మరో 250 పడకలతో కొత్త కొవిడ్ కేర్ సెంటర్ కోసం స్థల పరిశీలన చేస్తున్నట్లు తెలిపారు.
ప్రజల ఆరోగ్యం కోసం.. 16 ఫ్యామిలీ పార్కుల నిర్మాణానికి తీర్మానం చేశామన్నారు. స్వర్ణముఖి నదీ పరివాహక ప్రాంతాన్ని సుందరీకరించి ప్రజలు ధ్యానం, యోగా చేసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తామన్నారు. 16 లక్షల మాస్కులను వ్యక్తిగతంగా పంపిణీ చేశానన్న చెవిరెడ్డి.. ఆసుపత్రుల్లో అధిక ఫీజు వసూలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తిరుపతి గోవింద ధామం తరహాలో తిరుపతి అర్బన్ పరిధిలో రెండు, రూరల్ పరిధిలో మరో రెండు విద్యుత్ దహన వాటికలు ఏర్పాటు చేస్తామని చెవిరెడ్డి తెలిపారు.