కరోనాకు మందంటూ ప్రాచుర్యం పొందిన ఆనందయ్య ఆయుర్వేద వైద్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తిరుపతి శ్రీవెంకటేశ్వర ఆయుర్వేద బోధనాసుపత్రి వైద్యులు సంసిద్ధత తెలిపారు. ఈఓ జవహర్‌రెడ్డి ఆదేశాల మేరకు శనివారం కృష్ణపట్నంలో పర్యటించిన ఆస్పత్రి బృందం.. ఇవాళ మరోసారి సమావేశమైంది.
మరోసారి వైద్యులతో సమాలోచనలు..
చిత్తూరు జిల్లా శ్రీనివాస మంగాపురం సమీపంలోని శ్రీనివాస ఆయుర్వేద ఫార్మసీలో.. తితిదే పాలకమండలి సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో వైద్యులు సమావేశమయ్యారు. ఆనందయ్య ఔషధ తయారీతో పాటు.. తితిదే తరపున మందును తయారు చేసే దిశగా ఉన్న సాధ్యాసాధ్యాలపై సమాలోచనలు జరిపారు.
సుమారు 18 రకాల పదార్థాలు..
ఆనందయ్య ఆయుర్వేద ఔషధంలో ఎలాంటి చెడు ప్రభావాలు కలిగించే పదార్థాలను గుర్తించలేదన్న ఆయుర్వేద వైద్యులు.. 18 రకాల పదార్థాలను ఆనందయ్య వినియోగిస్తున్నట్లు ఎస్వీ ఆయుర్వేదిక్ వైద్యకళాశాల ప్రిన్సిపల్ డా. మురళీ కృష్ణ తెలిపారు.