పలమనేరులో తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసిన గోశాలలో దేశీయ గోజాతులను అభివృద్ధి చేసి.. వాటి సంరక్షణకు చర్యలు చేపడుతున్నామని ఆలయ ఈవో జవహర్‌రెడ్డి తెలిపారు. అదనపు ఈఓ ధర్మారెడ్డితో కలిసి పలమనేరులోని గోశాలను ఆయన సందర్శించారు. దేశవాళీ గోవులను, వృషభాలను పరిశీలించారు. ఇతర ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.
ఎస్వీ గోశాలకు పశువైద్య విశ్వవిద్యాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వం 450 ఎకరాలు కేటాయించిందని.. దేశవాళీ గోజాతుల అభివృద్ధి, గో ఆధారిత పంచగవ్య ఉత్పత్తుల తయారీ చేపడతామని ఈవో జవహర్ రెడ్డి తెలిపారు. పలమనేరు గోశాలలో వెయ్యికి పైగా దేశీయ గోవులు, వృషభాలు ఉన్నాయని, తిరుపతిలోని గోశాల నుంచి మరో వెయ్యి గోవులను తరలిస్తామని చెప్పారు. గోశాల చుట్టూ రక్షణ కంచె తదితర నిర్మాణాలు చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులను ఈవో ఆదేశించారు. కార్పొరేట్ సంస్ధలు, దాతలు గోశాలలో మౌలిక వసతులు పెంచేందుకు విరాళాలు అందచేయాలని కోరారు. నిపుణులైన శాస్త్రవేత్తలు ముందుకొచ్చి దేశీయ గో జాతుల అభివృద్ధిలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు.