కొవిడ్ కేసుల సంఖ్య తగ్గినా మహమ్మారి పూర్తిగా అదుపులోకి రాలేదు. ఈ తరుణంలో ప్రజారోగ్యం, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే తిరుమలలో భక్తుల సంఖ్యపై నిర్ణయం తీసుకుంటున్నట్లు తితిదే కార్యనిర్వహణాధికారి కె.ఎస్.జవహర్‌రెడ్డి తెలిపారు. అక్టోబరు నెలాఖరున కొవిడ్ పరిస్థితులపై సమీక్షించి, తదనుగుణంగా దర్శనం టోకెన్ల సంఖ్యపై నిర్ణయం తీసుకుంటామన్నారు. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 7న ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఈవో ‘ఈనాడు-ఈటీవీ భారత్’ ముఖాముఖిలో పలు అంశాలపై మాట్లాడారు.
వివరాలు ఆయన మాటల్లోనే..
- సర్వదర్శనం టోకెన్లను భక్తుల కోరిక మేరకే ఇటీవల ప్రారంభించాం. తొలుత రోజుకు రెండు వేల చొప్పున ఇచ్చి, ప్రస్తుతం 8 వేలకు పెంచాం. పురటాసి మాసం కావడంతో తమిళనాడు నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. టోకెన్ల జారీ కేంద్రం వద్ద కొవిడ్ నిబంధనలు అమలు చేయలేని పరిస్థితి ఏర్పడింది. అందుకే సర్వదర్శనం టోకెన్లను ఆన్‌లైన్‌లో ఇస్తున్నాం. అనేక ప్రయాసలకోర్చి ఈ విధానం రూపొందించాం. సమీప భవిష్యత్తులో భక్తుల సంఖ్యను పెంచే ఆలోచన లేదు.
- తిరుమలకు వచ్చే భక్తులు కేంద్ర మార్గదర్శకాల మేరకు రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్నట్లు ధ్రువీకరణ పత్రం తప్పకుండా తీసుకురావాలి. ముందస్తుగానే టిక్కెట్లు నమోదు చేసుకున్న వారు ఒక్క డోసు తీసుకున్నా.. అనుమతిస్తాం. కొవిడ్ నెగెటివ్ ధ్రువపత్రం ఉంటే మంచిది. 18 ఏళ్లలోపు వయసు వారు కూడా కొవిడ్ నెగిటివ్ ధ్రువపత్రం తప్పనిసరిగా తీసుకురావాలి.
- స్వామివారి దర్శనం టోకెన్ లేకున్నా.. మొక్కులు తీర్చుకునేందుకు తిరుమలకు అనుమతించాలని భక్తులు కోరుతున్నారు. ఇలా చేస్తే.. మరో సమస్య ఉత్పన్నమవుతుంది. ‘మొక్కుబడి’ భక్తుల సెంటిమెంట్ అయితే, ‘కొవిడ్ నిబంధనలు’ పాటించడం సైన్స్. ఈ రెండింటినీ సమన్వయం చేయడం కష్టం. అందుకే టోకెన్లు ఉన్న భక్తులనే అలిపిరి టోల్‌గేట్ నుంచి అనుమతిస్తున్నాం. దర్శనం టోకెన్లు లేకుండా తిరుపతికి వచ్చే భక్తులు.. పరిస్థితులను బట్టి స్థానిక తితిదే ఆలయాల్లో మొక్కులు తీర్చుకుంటే బాగుంటుంది. స్థానిక ఆలయాల్లో ఎలాంటి ఆంక్షలు లేవు. తగిన ఏర్పాట్లు చేశాం.
- అలిపిరి కాలినడక మార్గంలో భక్తుల రాకను బ్రహ్మోత్సవాల నుంచే అనుమతిస్తాం. ఈ దారి పొడవునా మరమ్మతులు దాదాపు పూర్తయ్యాయి. స్తంభాలకు కళాకృతులు వేసే పనులే మిగిలాయి. వీటితో భక్తుల రాకపోకలకు ఇబ్బంది ఉండదు.