ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా వైరస్‌ ప్రభావంతో వెలవెలబోతున్న తిరుమల - కరోనా వైరస్‌ ప్రభావంతో వెలవెలబోతున్న తిరుమల న్యూస్

నిత్యం వేలాది మంది భక్తులతో కళకళలాడుతుండే తిరుమల పుణ్యక్షేత్రం.... కరోనా వైరస్‌ దెబ్బకు వెలవెలబోతోంది. ప్రయాణికులతో కిటకిటలాడే విమానాశ్రయం, రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌ నిర్మానుష్యంగా మారిపోయాయి. వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు అధికారులు అడుగడుగునా పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు.

ttd-effected-by-tirumala
ttd-effected-by-tirumala

By

Published : Mar 19, 2020, 4:31 AM IST

కరోనా వైరస్‌ ప్రభావంతో వెలవెలబోతున్న తిరుమల

నిత్యకల్యాణం పచ్చతోరణంలా కళకళలాడే తిరుగిరులు.... కరోనా వైరస్‌ ధాటికి మూగబోయాయి. కోవిడ్‌-19 వేగంగా విస్తరిస్తున్న తరుణంలో.... తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా తగ్గిపోతోంది. అన్ని ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను రద్దు చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం.... కేవలం సర్వదర్శనానికి మాత్రమే అనుమతిస్తుండటంతో... పర్యాటకుల సంఖ్య పడిపోయింది. నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే తిరుపతి బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌, విమానాశ్రయాలు బోసిపోయాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల హెచ్చరికలతో అప్రమత్తమైన భక్తులు... దర్శనాన్ని వాయిదా వేసుకోవడం వల్ల.... చాలా ఏళ్ల తర్వాత తిరుమల, తిరుపతి సందడి కోల్పోయాయి.

రోజూ సుమారు 80 వేల మంది ప్రయాణికులతో అత్యంత రద్దీగా ఉండే తిరుపతి రైల్వేస్టేషన్‌... కరోనా ప్రభావంతో ఖాళీగా మారింది. నిత్యం 60 నుంచి 75 ప్యాసింజర్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఈ స్టేషన్‌ మీదుగా రాకపోకలు సాగిస్తాయి. వీటి ద్వారా రోజుకు సుమారు 40 లక్షల రూపాయల ఆదాయం తిరుపతి రైల్వేస్టేషన్‌ ఆర్జిస్తోంది. కరోనా ప్రభావంతో ఇప్పటికే 8 రైళ్లు పూర్తిగా రద్దవగా.... మిగిలిన సర్వీసుల్లోనూ ప్రయాణికుల సంఖ్య భారీగా పడిపోయింది. మరోవైపు... దేశం నలుమూలల నుంచి ప్రయాణికులు తిరుపతి రైల్వేస్టేషన్‌కు వచ్చే అవకాశం ఉండటంతో... ఎప్పటికప్పుడు పరిసరాలను సిబ్బంది శుభ్రం చేస్తున్నారు. ప్లాట్‌ఫాంలు, కుర్చీలు, బల్లలు, స్విచ్‌బోర్డులు.... ఇలా ఏ మూల వదలకుండా శుభ్రపరుస్తున్నారు. దీని కోసం ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేయడంతో పాటు.... వారితో ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్నామని రైల్వేస్టేషన్‌ అధికారులు తెలిపారు.

తెలుగు రాష్ట్రాల నుంచి కాక, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చే బస్సులతో కోలాహలంగా ఉండే తిరుపతి బస్టాండ్ స్తబ్దుగా మారిపోయింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బస్సు సర్వీసుల్లో చాలా వరకు రద్దయ్యాయి. ప్రయాణికుల భద్రత దృష్ట్యా.... అధికారులు శ్రీహరి, ఏడుకొండలు, శ్రీనివాస, అలిపిరి బస్టాండ్‌లలో బస్సులను రసాయనాలతో శుభ్రం చేస్తున్నారు. వచ్చే ప్రయాణికులను సైతం అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద శరీర ఉష్ణోగ్రతలను పరిశీలించాకే తిరుమలకు అనుమతిస్తున్నారు.

రేణిగుంట విమానాశ్రయానికి ఇప్పటికే చాలా వరకూ సర్వీసులు నిలిచిపోగా.... వచ్చే ప్రయాణికులను థర్మల్ పరీక్షలు జరిపిన తర్వాతే అనుమతిస్తున్నారు. విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులను మాత్రం పరీక్షలు జరిపిన తర్వాత స్విమ్స్, రుయా ఆసుపత్రులకు తరలించి అనంతరం వారి ఊర్లకు వెళ్లేలా ఏర్పాట్లుచేస్తున్నారు.పర్యాటకుల సంఖ్య భారీగా పడిపోవడం..... హోటళ్లు, రిక్షా కార్మికులు సహా పలు వ్యాపార వర్గాల పైనా పెను ప్రభావం చూపుతోంది.

ఇవీ చదవండి:కరోనాపై ప్రభుత్వ తీరు బాధ్యతారాహిత్యం : చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details