ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీవారి భక్తులకు తితిదే శుభవార్త... ఆర్జిత సేవల్లో పాల్గొనేందుకు అనుమతి - ఆర్జిత సేవలకు భక్తులను అనుమతిస్తున్నట్లు ప్రకటించిన తితిదే

Arjitha Seva Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు తితిదే అధికారులు శుభవార్త తెలిపారు. ఏప్రిల్‌ 1 నుంచి భక్తులను ఆర్జిత సేవలకు అనుమతిస్తున్నట్లు పేర్కొన్నారు. కొవిడ్‌ ఉద్ధృతి తగ్గిన నేపథ్యంలో రెండేళ్ల తర్వాత తిరిగి భక్తులకు ఈ అవకాశం కల్పించారు.

TTD Arjitha Seva tickets released soon
TTD Arjitha Seva tickets released soon

By

Published : Mar 17, 2022, 7:30 PM IST

Arjitha Seva Tickets: తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్‌ 1 నుంచి ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించాలని తితిదే నిర్ణయించింది. కొవిడ్‌ నేపథ్యంలో 2020 మార్చి నుంచి భక్తులను అనుమతించకుండా ఏకాంతంగా ఆర్జిత సేవలు నిర్వహిస్తున్నారు. కొవిడ్‌ ఉద్ధృతి తగ్గిన నేపథ్యంలో రెండేళ్ల తర్వాత తిరిగి భక్తులకు అవకాశం కల్పించారు. ఇందులో భాగంగా ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను మార్చి 20వ తేదీ ఉదయం 10గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. భక్తులు tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవ‌చ్చు. కొవిడ్‌-19 నిబంధ‌న‌లు పాటిస్తూ ఆయా సేవ‌ల‌కు భ‌క్తుల‌ను అనుమ‌తిస్తారు.

ఎలక్ట్రానిక్‌ డిప్‌ విధానంలో టికెట్ల కేటాయింపు..

సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టాదళపాదపద్మారాధన, నిజపాద దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌ ఎలక్ట్రానిక్‌ డిప్‌ విధానంలో కేటాయిస్తారు. ఈ సేవలను బుక్‌ చేసుకునేందుకు మార్చి 20వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మార్చి 22వ తేదీ ఉదయం 10గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ ఎలక్ట్రానిక్‌ డిప్‌ విధానంలో భక్తులకు టికెట్లు కేటాయిస్తారు. టికెట్లు పొందిన వారి జాబితాను మార్చి 22వ తేదీ ఉదయం 10గంటల తర్వాత వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. భక్తులకు ఎస్‌ఎంఎస్‌, ఈ-మెయిల్‌ ద్వారా తెలియజేస్తారు. టికెట్లు పొందిన వారు రెండ్రోజుల్లో టికెట్‌ ధర చెల్లించాల్సి ఉంటుంది. కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను ముందు వచ్చిన వారికి ముందు అనే ప్రాతిపదికన భక్తులు నేరుగా బుక్‌ చేసుకోవచ్చు.

పర్వదినాల్లో పలు ఆర్జిత సేవలు రద్దు..

ఏప్రిల్‌ 2న ఉగాది సందర్భంగా కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఏప్రిల్‌ 10న శ్రీరామనవమి సందర్భంగా తోమాల, అర్చన, సహస్ర దీపాలంకార సేవలను తితిదే రద్దు చేసింది. అలాగే.. వసంతోత్సవాల సందర్భంగా ఏప్రిల్‌ 14 నుంచి 16 వరకు కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను, ఏప్రిల్‌ 15న నిజపాద దర్శనం సేవలను రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. శ్రీ పద్మావతి పరిణయోత్సవాల సందర్భంగా మే 10 నుంచి 12వ తేదీ వరకు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు, జూన్‌ 14న జ్యేష్టాభిషేకం మూడో రోజున అష్టాదళపాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలు రద్దయ్యాయి. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని తితిదే అధికారులు విజ్ఞప్తి చేశారు.

నెగిటివ్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరి..

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కొవిడ్‌ నెగిటివ్‌ సర్టిఫికెట్‌ కానీ, రెండు డోసుల వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ కానీ తప్పనిసరిగా తీసుకురావాలని తితిదే విజ్ఞప్తి చేసింది. భక్తులు తమ ఆరోగ్యం, తితిదే ఉద్యోగుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని సహకరించాలని అధికారులు కోరారు.

మార్చి 18న పౌర్ణమి గరుడ సేవ..

పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 18న గరుడసేవ జరగనుంది. శుక్రవారం పాల్గుణ పౌర్ణమి కావడం విశేషం. ప్రతి నెలా పౌర్ణమి పర్వదినాన తితిదే గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాత్రి 7గంటల నుంచి 9గంటల మధ్య సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామి గరుడినిపై తిరుమాఢ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.

ఇదీ చదవండి:తితిదే ధర్మకర్తల మండలి కీలక నిర్ణయాలు..

ABOUT THE AUTHOR

...view details