దాదాపు 10 నెలల తరువాత తిరుమలలో సందర్శనీయ ప్రాంతాల్లోకి భక్తులను తితిదే అనుమతిస్తోంది. కరోనా ప్రభావంతో గతేడాది మార్చి 20 నుంచి శ్రీవారి పాదాలు, పాపవినాశనం మార్గం పూర్తిగా మూసివేశారు. జూన్ నుంచి దశల వారీగా దర్శనానికి అనుమతిస్తున్నా.. సందర్శనీయ ప్రాంతాలకు మాత్రం అనుమతివ్వలేదు. కరోనాకు వ్యాక్సిన్ రావడం, లాక్‌డౌన్ సడలింపుల కారణంగా తిరుమలలోని తీర్థాలకు అనుమతివ్వాలని తితిదే నిర్ణయించింది.
మంగళవారం ఉదయం నుంచి పాపవినాశనం, ఆగాశగంగ, చక్రతీర్థంతో పాటు జపాలీ తీర్థం, వేణుగోపాలస్వామి ఆలయం, శ్రీవారి పాదాలకు యాత్రికులను అనుమతిస్తున్నారు. భక్తులు లేక ఇన్నాళ్లూ బోసిపోయిన తీర్థాలు తిరిగి భక్తజన సంచారంతో కళకళలాడుతున్నాయి.