ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

TTD Incense sticks: తితిదే బ్రాండ్​తో అగరబత్తీలు.. విక్రయాలు అక్కడే..

తిరుపతిలోని ఎస్వీ గోశాలలో తితిదే అగరబత్తీల విక్రయాలను ఆ సంస్థ ఛైర్మన్‌ సుబ్బారెడ్డి ప్రారంభించారు. శ్రీవారి ఏడుకొండలకు సూచికగా 7 బ్రాండ్లతో అగరబత్తీలను తయారు చేసినట్లు తెలిపారు.

By

Published : Sep 13, 2021, 10:53 AM IST

Updated : Sep 13, 2021, 2:26 PM IST

Ttd brand Agarbattis
తితిదే బ్రాండ్​తో అగరబత్తీలు

తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ఉప‌యోగించిన పుష్పాల‌తో ప‌రిమ‌ళాలు వెదజల్లే అగ‌ర‌బ‌త్తులు త‌యారుచేసి భ‌క్తుల‌కు అందుబాటులోకి తీసుకువచ్చారు. తిరుపతిలోని ఎస్వీ గోశాలలో అగరబత్తుల విక్రయాన్ని తితిదే ఛైర్మన్‌ సుబ్బారెడ్డి ప్రారంభించారు. తిరుమల ఏడు కొండలను ప్రతిబింబించేలా ఏడు రకాల అగరబత్తులను ఉత్పత్తి చేయనున్నట్లు ఛైర్మన్ తెలిపారు. వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయంతో కలిసి ఆలయాల్లో వినియోగించిన పూలతో దేవుడి చిత్రపటాలు, కీ చైన్లు, పేపర్ వెయిట్​లు వంటి ఇతర వస్తువులను తయారు చేసేందుకు ఒప్పందం చేసుకున్నట్లు ఛైర్మన్ తెలిపారు. ఎండు పూలతో చిత్రపటాలు తయారు చేసేందుకు 83 లక్షలతో యంత్రాలు కొనుగోలు చేయనున్నట్లు ఛైర్మన్ తెలిపారు. గడిచిన కొన్ని రోజులుగా ముద్రణ ఆగిపోయిన సప్తగిరి మాసపత్రికను తిరిగి ప్రారంభించామన్నారు.

తితిదే బ్రాండ్​తో అగరబత్తీలు

ఆలోచనకు పునాది పడింది ఇలా..

తితిదే (TTD) ఆలయాల్లో పూజ‌లు, అలంక‌ర‌ణ‌ల‌కు రోజూ పుష్పాలు వినియోగిస్తున్నారు. ప‌ర్వ‌దినాలు, ఉత్స‌వాల స‌మ‌యంలో అయితే పుష్పాల వినియోగం మ‌రింత అధికంగా ఉంటుంది. దేవతామూర్తులకు ఉప‌యోగించిన పుష్పాల‌న్నీ మ‌రుస‌టిరోజు ఉద‌యం తొల‌గిస్తారు. దీంతో స్వామివారి సేవ‌కు వినియోగించిన ఈ పుష్పాలు వృథా కాకుండా తిరిగి ఉప‌యోగించే విష‌యంపై తితిదే బోర్డు వినూత్న ఆలోచన చేసింది. ఈ క్రమంలో బెంగ‌ళూరు కేంద్రంగా పనిచేస్తున్న ద‌ర్శ‌న్ ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ తితిదే ఆల‌యాల్లో రోజువారీగా వినియోగించిన పుష్పాల‌ను అందిస్తే లాభంతో సంబంధంలేకుండా అగ‌ర‌బ‌త్తులు త‌యారుచేసేందుకు ముందుకొచ్చింది. దీంతో ఆ సంస్థ‌తో తితిదే అవగాహన కుదుర్చుకొని ఎస్వీ గోశాల‌లో అగ‌ర‌బ‌త్తుల త‌యారీకి అవ‌స‌ర‌మైన స్థ‌లం కేటాయించింది. ద‌ర్శ‌న్ ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ సొంత ఖ‌ర్చుతో యంత్రాలు, సిబ్బందిని నియ‌మించుకుని కొన్ని రోజులుగా ప్ర‌యోగాత్మ‌కంగా అగ‌ర‌బ‌త్తుల ఉత్ప‌త్తిని ప్రారంభించింది.

అగ‌ర‌బ‌త్తుల త‌యారీ ఎలాగంటే..

తితిదే స్థానిక ఆల‌యాల్లో వినియోగించిన పుష్పాల‌ను ఉద్యాన‌వ‌న విభాగం సిబ్బంది ఎస్వీ గోశాల‌లోని అగ‌ర‌బ‌త్తుల త‌యారీ కేంద్రానికి త‌ర‌లిస్తారు. ప్ర‌త్యేకంగా శిక్ష‌ణ పొందిన సిబ్బంది వీటిని ర‌కాల వారీగా పుష్పాల‌ను వేరు చేస్తారు. అనంత‌రం వాటిని డ్రైయింగ్ యంత్రంలో పూర్తిగా ఎండేలా చేసి పిండిగా మారుస్తారు. ఆ త‌రువాత పిండికి నీరు క‌లిపి కొన్ని ప‌దార్థాల‌తో మిక్సింగ్ చేస్తారు. ఈ మిశ్ర‌మాన్ని మ‌రో యంత్రంలో వేసి అగ‌ర‌బ‌త్తులు త‌యారుచేస్తారు. వీటిని ప్ర‌త్యేక యంత్రంలో 15 నుంచి 16 గంట‌ల పాటు ఆర‌బెట్టిన త‌రువాత మ‌రో యంత్రంలో ఉంచి సువాస‌న వెదజ‌ల్లే ద్రావ‌ణంలో ముంచుతారు. చివ‌ర‌గా వీటిని మ‌రోసారి ఆరబెట్టి యంత్రాల ద్వారా ప్యాకింగ్ చేస్తారు. మొత్తం 10 యంత్రాల ద్వారా రోజుకు 3.50 ల‌క్ష‌ల అగ‌ర‌బ‌త్తులు త‌యారుచేసేలా ఏర్పాట్లు చేశారు.

ఇదీ చదవండీ.. BOARDS MEETING: ఇవాళ కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల భేటీ

Last Updated : Sep 13, 2021, 2:26 PM IST

ABOUT THE AUTHOR

...view details