అరుదైన వృక్ష జాతులు... పచ్చని చెట్ల మధ్యలో జలపాతం... చుట్టూ కొండలు... జంతువుల అరుపులు... ఇవి వింటుంటే ఎంతో అందమైన ప్రదేశంలో ఉన్న అనుభూతి కలుగుతోంది కదూ... నిజమే ప్రకృతి ప్రేమికులను కట్టిపడేసే 'తలకోన' గురించే చెప్పేది. తలకోనలో ఇవే కాకుండా... సహజసిద్ధంగా వెలసిన శ్రీ సిద్దేశ్వరస్వామి శివాలయం ఉంది. పెద్దలకు ఆధ్యాత్మికంగా... పిల్లలకు ఆటవిడుపు కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న తలకోన ఇప్పుడు పర్యాటకులతో కిటకిటలాడుతోంది. ప్రకృతిని ఆస్వాదించడానికి ఈ ప్రదేశం ఎంతో బాగుందని పర్యాటకులు ఆనందిస్తున్నారు.
వేసవి సెలవులు... 'తలకోన'లో సరదాగా
పిల్లలకు వేసవి సెలవులు ఇవ్వడంతో సరదాగా గడపడానికి పర్యాటక కేంద్రాల వైపు పరుగులు తీస్తున్నారు. పిల్లలు చదువుల నుంచి... పెద్దలు పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి ప్రశాంతమైన ప్రదేశాలకు వెళ్లడానికి ఇష్టపడతారు. అలాంటి ప్రదేశాల్లో చిత్తూరు జిల్లా ఎర్రావారిపాళెం మండలంలోని తలకోన ఒకటి. విస్తారంగా ఉన్న శేషాచల అడవుల మధ్యలో జలపాతం తలకోన ప్రత్యేకత. మండు వేసవిలోనూ ఇక్కడి జలపాతంలో నీరు ఉండడం విశేషం.
జలజల పారే సెలయేరులు... భారీ వృక్షాలకు పెట్టింది పేరు ఈ తలకోన. మరపురాని వేసవి విడిదిగా ఈ ప్రాంతం ఉంటుందని పర్యాటకులు అంటున్నారు. సుదూర ప్రాంతాల నుంచి ఒక్కసారి వస్తే... మళ్లీమళ్లీ రావాలనిపించే విధంగా ఉందని చెబుతున్నారు. ఇక్కడికొచ్చే పర్యాటకులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. యాత్రికులకు వసతితోపాటు భోజన సదుపాయాలు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో తలకోనకు పర్యాటకులు పోటెత్తుతున్నారు. మరింకెందుకు ఆలస్యం... మీ పిల్లలతో ఓసారి ప్రకృతిని ఆస్వాదించండి.