చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. పండించిన పంటకు ధరలేక ఇప్పటికే రైతులు పంటను రోడ్డు పక్కన పారబోస్తున్నారు. అయినా గుజ్జు పరిశ్రమల యజమానుల్లో మార్పు రావడం లేదు. రెండు రోజుల క్రితం వరకు తోతాపురి మామిడి కాయలు టన్ను రూ.8 వేలు పలికింది. శనివారం పుత్తూరు, బంగారు పాళ్యం మార్కెట్ యార్డుల్లో టన్ను రూ.6 వేలు పలకడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.
టన్ను రూ.9 వేలకు తగ్గకుండా చూడాల్సిందే..
జిల్లా కలెక్టర్ పలుమార్లు గుజ్జుపరిశ్రమలు, రైతులతో సమావేశాలు నిర్వహించి టన్ను రూ.9 వేలకు తగ్గకుండా చూడాలని ఆదేశించారు. రైతులు కోరినట్లు టన్నుకు రూ.13వేలు కాకపోయినా రూ.11 వేలు ఇవ్వాలన్నారు. అందుకు అంగీకరించిన గుజ్జు పరిశ్రమల యజమానులు 24 గంటలు గడవక ముందే మాట మార్చారు.
అన్నదాతల ఆందోళన..
మామిడి ధరలు మరింత క్షీణిస్తుండటంపై అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. తూర్పు మండలాల్లో ఇప్పటికే 60 శాతానికిపైగా కోతలు పూర్తి కావొచ్చాయి. మరో 15 రోజుల్లో మొత్తం పంట అయిపోతుంది. బంగారు పాళ్యం ఏరియాలో మరో నెల రోజుల పాటు మామిడి పంట మార్కెట్‌కు వస్తుంది. ఇప్పటికే కృష్ణా జిల్లాలోని నూజివీడులో సీజన్ దాదాపుగా పూర్తి కావొచ్చింది. ఇప్పటికే జిల్లాలోని మామిడికి ఆశించిన ధరలు రావాలి.