అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి దేవేరి శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు తిరుచానూరులో తితిదే విస్తృత ఏర్పాట్లు చేసింది. తొమ్మిది రోజుల పాటు జరగనున్న ఉత్సవాల్లో అమ్మవారు వివిధ వాహనాలపై నాలుగు మాఢ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. వేడుకల ప్రారంభం నేపథ్యంలో అమ్మవారికి లక్ష కుంకుమార్చన నిర్వహించారు. సేనాధిపతి ఉత్సవం అనంతరం వేదమంత్రోచ్ఛారణల మధ్య బ్రహ్మోత్సవాలకు పండితులు అంకురార్పణ చేశారు. కార్తిక బ్రహ్మోత్సవాల్లో అమ్మవారు ధన, ధాన్య, ధైర్య, సంతాన లక్ష్మి రూపంలో భక్తులకు అభయ ప్రదానం చేయనున్నారు. ఇవాళ్టి ఉదయం ధ్వజారోహణం సేవతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
రోజూ రెండు వాహన సేవలు
ఆపద మొక్కుల వాడు శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాల తరహాలోనే పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే ఉత్సవాలు... తొమ్మిదో రోజు పంచమతీర్థంతో ముగుస్తాయి. రోజూ ఉదయం, సాయంత్రం రెండు వాహన సేవలు నిర్వహిస్తారు. గజ, గరుడ వాహనం, రథోత్సవం సేవల్లో రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. చివరి రోజైన పంచమ తీర్థానికి.. వెంకటేశుని బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవకు ఉన్న ప్రాధాన్యత ఉంది.