తిరుపతి రుయా ఆసుపత్రిలో జరిగిన విషాదకర ఘటన తీవ్రతను తగ్గించేందుకు... మృతులను తగ్గించి చూపిస్తున్నారని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. సోమవారం రాత్రి ఘటన జరిగిన రోజు మృతుల జాబితా అంతా తప్పుల తడకలా ఉందని భాజపా నేతలతో కలిసి ఆయన ఆర్డీవోను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... మృతులు పెద్దసంఖ్యలో ఉన్నారన్నారు.
జిల్లా అధికారులు ఎవరి మెప్పుకోసమో ఘటనను తక్కువ చేసి చూపిస్తున్నారని పేర్కొన్నారు. సాక్షాత్తు భాజపా జిల్లా స్థాయి నేత అదే సమయంలో మృతిచెందినా ఆయన పేరు పదకొండు మందిలో లేకపోవటం.. అధికారులు దాచిపెడుతున్న వాస్తవాలను బట్టబయలు చేస్తోందన్నారు. ఆక్సిజన్ అందుబాటులో లేకపోతే... జిల్లా అధికారులు అంతా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి వాస్తవాలను బయటపెట్టకపోతే.. బాధితుల తరపున పోరాటానికి దిగుతామని హెచ్చరించారు.