సమష్టి కృషితో పనిచేసి తిరుపతి పార్లమెంటు ఎన్నికల్లో తేదేపా అభ్యర్థిని గెలిపించాలని మాజీ మంత్రులు, తెదేపా అగ్ర నేతలు యనమల రామకృష్ణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి... కార్యకర్తలకు సూచించారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తేదేపా కార్యకర్తలతో వారు సమావేశమయ్యారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత పవిత్రమైన శ్రీకాళహస్తి క్షేత్రం.. దోపిడీకి కేరాఫ్‌గా మారిందని తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ ఇంఛార్జ్ నిమ్మల రామానాయుడు విమర్శించారు. వైకాపా పాలనలో ఎలాంటి సంక్షేమ పథకాలు లేనప్పటికీ కేసులు, బెదిరింపులతో జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని మండిపడ్డారు.
పెండింగ్ ప్రాజెక్ట్‌లను పరుగులు పెట్టిస్తా: పనబాక లక్ష్మి
22 మంది ఎంపీలున్న వైకాపా ప్రభుత్వం ఇప్పటివరకు కేంద్రంలో ఏం సాధించిన్న విషయాన్ని ఓటర్లు ప్రశ్నించాలని తెదేపా అభ్యర్థి పనబాక లక్ష్మి పిలుపునిచ్చారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వనందుకే తేదేపా ఎన్డీఏ కూటమి నుంచి వైదొలగి కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేసిందని ఆమె గుర్తుచేశారు. తిరుపతిలో వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తానన్న ప్రధాని నరేంద్ర మోదీ... ఆ తర్వాత కాలంలో దాని ఊసే ఎత్తడం లేదన్నారు. శ్రీకాళహస్తి - నడికుడి రైల్వే ప్రాజెక్ట్‌కు గతంలో ఆమోదం తెలిపినప్పటికీ ఇప్పటివరకు కేంద్రం నుంచి నిధులు రాకపోవడం వైకాపా ఎంపీల చేతగానితనానికి నిదర్శనమన్నారు. ఎంపీగా గెలిస్తే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులన్నీ పరుగులు పెట్టిస్తానని ఆమె హామీ ఇచ్చారు.