ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జంటగా మెుదటి స్థానంలో తిరుపతి-రేణిగుంట రైల్వేస్టేషన్లు - తిరుపతి రైల్వే స్టేషన్​కి ఐఎస్​ఓ సర్టిఫికేట్ వార్తలు

నిత్యం 70వేల నుంచి 80 వేల మంది ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చే ప్రాంగణమది. ఏడాదికి రెండువందల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించే అతిపెద్ద రైల్వే స్టేషన్ అది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు గమ్యస్థానాలకు చేర్చుతూ....దేశంలోనే ప్రముఖ రైల్వే స్టేషన్ లలో ఒకటిగా పేరుతెచ్చుకున్న తిరుపతి రైల్వేస్టేషన్ మరో ఘనతను కైవసం చేసుకుంది. జంట రైల్వే స్టేషన్ రేణిగుంట జంక్షన్ తో కలిసి సంయుక్తంగా ఐఎస్ఓ గుర్తింపును సాధించి....జాతీయ స్థాయిలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న తిరుపతి రైల్వే స్టేషన్ పై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం.

tirupathi
తిరుపతి- రేణిగుంట రైల్వేస్టేషన్లకు ఐఎస్ఓ గుర్తింపు

By

Published : Sep 15, 2020, 11:54 PM IST

కలియుగ వైకుంఠనాధుడు...తిరుమల శ్రీవారి దర్శనం కోసం అసంఖ్యాకంగా తరలివచ్చే యాత్రికులే ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న తిరుపతి రైల్వే స్టేషన్ మరో మారు వార్తల్లో నిలిచింది. 2018లో స్వచ్ఛ రైల్వే స్టేషన్ గా జాతీయ స్థాయిలో మూడో స్థానం, 2019లో గ్రీన్ బిల్డింగ్ అవార్డులను కైవసం చేసుకున్న తిరుపతి రైల్వే స్టేషన్ ఈ సారి ఐఎస్ఓ గుర్తింపును కైవసం చేసుకుంది. సమీప రైల్వే స్టేషన్ రేణిగుంట జంక్షన్ తో కలిసి ఐఎస్ఓ ధృవీకరణను పొందిన తిరుపతి రైల్వే స్టేషన్.....ఏ1 గ్రేడ్ స్టేషన్ గా రాణిస్తూ....ఓ వైపు ఆదాయాన్ని మరోవైపు జాతీయ స్థాయి గుర్తింపులను అందుకుంటూ సత్తా చాటుతోంది.

ప్యాసింజర్ లు, ఎక్స్ ప్రెస్ లు కలిపి తిరుపతిలో రోజుకు 70 నుంచి 80 రైలు సర్వీసులు నడుస్తాయి. రోజుకు 35-40 లక్షల రూపాయల ఆదాయం కేవలం టిక్కెట్ల రూపంలో వస్తుంటుంది. ఏడాదికి 200 కోట్ల రూపాయలను ఆదాయాన్ని ఆర్జిస్తూ రాష్ట్రంలో అధిక రెవెన్యూ వచ్చే రైల్వే స్టేషన్ గా....జాతీయ స్థాయిలో ఏ1 గ్రేడ్​తో తిరుపతి రైల్వే ప్రయాణికులకు సేవలందిస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా గడచిన ఆరునెలలుగా రైల్వే సర్వీసులకు బ్రేక్ పడటంతో..... ప్రస్తుతం రాయలసీమ స్పెషల్ ఎక్స్ ప్రెస్ రైలు మాత్రమే స్టేషన్ లో సర్వీసు కొనసాగిస్తోంది. కానీ స్టేషన్ లో ఉండే మౌలిక వసతులు, ప్రయాణికుల అందిస్తున్న సేవల నాణ్యత పరంగా గడచిన కొన్ని సంవత్సరాల సేవలను గుర్తించిన కేంద్ర నాణ్యతా ప్రమాణాల ధృవీకృత సంస్థ- ఐఎస్ఓ 14001:2015 సంఖ్యతో రేణిగుంట, తిరుపతి రైల్వే స్టేషన్ లకు అధికారిక గుర్తింపుతో కూడిన ధృవీకరణ పత్రాలను అంద చేసింది.

తిరుపతి, రేణిగుంట రైల్వే స్టేషన్ లకు ఐఎస్ఓ గుర్తింపు అందచేయటంలో భాగంగా స్టేషన్లలో అనేక విషయాలపై అధికారులు పరీశీలన జరిపారు. ప్రయాణికుడు స్టేషన్ లో అడుగు పెట్టినప్పటి నుంచి మెటల్ డిటెక్టర్లు, సీసీ కెమెరాలు, టిక్కెట్ల క్యూలైన్ల వద్ద అందుతున్న సేవలు, అత్యున్నత సాంకేతికత వినియోగం, స్టేషన్ లోపలకి వచ్చాక మెరుగైన తాగునీటి సౌకర్యం, విలాసవంతమైన విశ్రాంతి గదుల సౌకర్యాలను పరిగణనలోకి తీసుకున్నారు. స్వచ్ఛభారత్ మిషన్ లో భాగంగా స్టేషన్ లో పాటిస్తున్న పారిశుద్ధ్య నిర్వహణ.....మూడు షిఫ్ట్​ల్లోనూ కార్మికులు విధులు నిర్వహిస్తూ 24 గంటల పాటు స్టేషన్ ను పరిశుభ్రంగా ఉంచటం గుర్తింపు సాధించటంలో కీలక అంశం. రేణిగుంటలో 119 మంది, తిరుపతిలో 115 మంది పారిశుద్ధ్య కార్మికులు స్టేషన్ క్లీనింగ్ కోసం, మరో 90మంది రైళ్ల క్లీనింగ్ కోసం నిరంతరం శ్రమిస్తూ స్టేషన్ పారిశుద్ధ్య నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్నారు. విద్యుత్ వినియోగం కోసం సోలార్ ప్లేట్ల వినియోగం, వనరుల పునర్వినియోగంలో భాగంగా ఏర్పాటు చేసిన వాటర్ రీసైక్లింగ్ యూనిట్ అన్నీ తిరుపతి రైల్వే స్టేషన్ ను ప్రత్యేకంగా నిలబెట్టాయి.

కరోనా మహమ్మారి ప్రబలుతున్న నేపథ్యంలోనూ తిరుపతి రైల్వే స్టేషన్ లో ప్రోటోకాల్ ను పక్కాగా పాటిస్తున్నట్లు స్టేషన్ అధికారులు చెబుతున్నారు. తరచుగా స్టేషన్ ను శానిటైజ్ చేయటం దగ్గర నుంచి....టికెట్ కౌంటర్ల వద్ద టికెట్ చెకింగ్ స్కానర్లు, అత్యున్నత సాంకేతికతతో థర్మల్ స్క్రీనింగ్ పరికరాల ఏర్పాటు, రైళ్లలో భౌతిక దూరాన్ని కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవటం వంటివి చేస్తూ జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రమాణాలను అవలంబిస్తున్న స్టేషన్ గా తీర్చిదిద్దుతున్నామంటున్నారు. 2023వరకూ ఈ ఐఎస్ఓ గుర్తింపు కాలపరిమితి ఉంటుందన్న అధికారులు...ఈ గుర్తింపు కారణంగా.....స్వచ్ఛభారత్ మిషన్ లో 30మార్కులు అదనంగా తిరుపతిలో ఖాతాలో చేరుతాయంటున్నారు.

ఇదీ చదవండి:బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా అంటే ఎలా నిర్వహిస్తారు?... ప్రత్యేకతేంటి?

ABOUT THE AUTHOR

...view details