తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. 300 రూపాయల ప్రత్యేక దర్శన టికెట్లను అందుబాటులో ఉంచింది. జనవరి నెలకు సంబంధించి నాలుగు లక్షల 60 వేల టికెట్లను విడుదల చేశారు. వర్చువల్ క్యూ, ఓటీపీల ద్వారా టికెట్లను కేటాయించారు. జనవరిలో వైకుంఠ ఏకాదశి ఉండడంతో అధిక సంఖ్యలో భక్తులు టికెట్ల కోసం ప్రయత్నించగా.. 80నిమిషాల్లోనే ఖాళీ అయ్యాయి. సర్వదర్శనం టికెట్లను ఈ నెల 31వ తేదీ నుంచి కరెంట్ బుకింగ్ ద్వారా కేటాయించాలని తితిదే భావిస్తోంది.
శ్రీవారి భక్తుల సౌకర్యార్థం జనవరి నెలకు సంబంధించి 1, 2 తేదీలు, 13 నుంచి 22 వరకు, 26వ తేదీల్లో 5,500 వర్చువల్ సేవా దర్శన టికెట్లను తితిదే విడుదల చేసింది. శుక్రవారం ఉదయం 9 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను జనవరి 1, 13 నుంచి 22వ తేదీ వరకు.. రోజుకు 20 వేలు చొప్పున.. జనవరి 2 నుంచి 12, 23 నుంచి 31 వరకు.. రోజుకు 12 వేల చొప్పున ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. తిరుమలలో వసతి గదుల సమాచారాన్ని ఈ నెల 27న ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో ప్రకటించనున్నట్లు తితిదే వెల్లడించింది. జనవరి 11 నుంచి 14 వరకు వసతిని తిరుమలలోనే కరెంట్ బుకింగ్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో ముందుగానే దర్శన, వసతిని టికెట్లను బుక్ చేసుకోవాలని భక్తులు తితిదే సూచించింది.