ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుమలేశుడి బ్రహ్మోత్సవాలు.. నేడు ధ్వజారోహణం - తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు 2020

తిరుమలేశుడి బ్రహ్మోత్సవ సంబరాలకు సర్వం సిద్ధమైంది. ఉత్సవాలకు అంకురార్పణ క్రతువును అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు మీనలగ్నంలో బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణం నిర్వహించనున్నారు. రాత్రి జరిగే పెద్దశేష వాహన సేవతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. కరోనా కారణంగా ఉత్సవాలను ఆలయంలోనే ఏకాంతంగా నిర్వహిస్తున్న తితిదే.. వైదిక కార్యక్రమాలన్నింటినీ శాస్త్రోక్తంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటోంది.

tirumala brahmotsavam
tirumala brahmotsavam

By

Published : Sep 19, 2020, 4:27 AM IST

ఏడుకొండలవాడి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమాన్ని అర్చకులు వైఖానస ఆగమోక్తంగా నిర్వహించారు. స్వామివారి సేనాధిపతులైన విశ్వక్సేనుల శ్రీవారి సన్నిధి నుంచి విమాన ప్రదక్షణగా రంగనాయకుల మండపానికి చేరుకున్నారు. వైదిక కార్యక్రమాలను అనంతరం యాగశాలలో అంకురార్పణ జరిగింది. ఉత్సవాల విజయానికి స్వామివారి ఆశీస్సులు పొందుతూ నవ ధాన్యాలను మొలకెత్తించారు.

ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం పలుకుతూ సాయంత్రం 6 గంటల 3 నిమిషాల నుంచి 6 గంటల 30 నిమిషాల మధ్య మీన లగ్నంలో.. ధ్వజారోహణం జరుగుతుంది. దీనికోసం విష్ణు దర్బతో తయారు చేసిన 7 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పు ఉన్న చాపను, 211 అడుగుల పొడవు తాడును సిద్ధం చేశారు. రాత్రి ఎనిమిదిన్నర గంటలకు పెద్దశేషవాహనసేతో వాహన సేవలు ప్రారంభమవుతాయి. 9 రోజుల పాటు స్వామివారు వివిధ వాహన సేవలపై దర్శనమిస్తారు. కరోనా కారణంగా బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. ఆలయం లోపల కల్యాణ మండపంలో వాహన సేవలను కొలువు తీర్చి వైదిక కార్యక్రమాలను నిర్వహిస్తారు.

బ్రహ్మోత్సవాల నిర్వహణపై మరోమారు సమీక్షించిన ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి.... ఉత్సవాలను శాస్త్రోకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. గరుడ సేవ రోజు ముఖ్యమంత్రి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. 24వ తేదీన కర్ణాటక సీఎంతో కలిసి ముఖ్యమంత్రి జగన్‌.. నాదనీరాజనం వేదికపై నిర్వహిస్తున్న సుందరకాండ పారాయణంలో పాల్గొంటారని వెల్లడించారు. తిరుమలలో కర్ణాటక ప్రభుత్వం నిర్మించనున్న వసతిగృహాలకు ఇద్దరు ముఖ్యమంత్రులు శంకుస్థాపన చేస్తారన్నారు.

బ్రహ్మోత్సవాల వేళ శ్రీవారి ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. విద్యుత్‌ దీపాలంకరణలతో పాటు స్వామివారి సన్నిధి, పడికావలి, ఉత్సవాలు నిర్వహించే కల్యాణ మండపం, రంగనామకుల మండపాన్ని వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు.

ఇదీ చదవండి:శ్రీవారి బ్రహ్మోత్సవాలకు నిరాడంబరంగా అంకురార్పణ

ABOUT THE AUTHOR

...view details