సోమవారం ఉదయం ఎప్పటిలాగే సప్తగిరి గ్రామీణ బ్యాంకుకు వెళ్లాడు ఆ బ్యాంకు మేనేజర్. అక్కడ పరిస్థితి చూసి ఒక్కసారిగా అవాక్కయ్యాడు. బ్యాంకు తాళాలు పగులకొట్టి ఉండటం చూసి నివ్వెరపోయాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన పోలీసులు..పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. ఓ వ్యక్తి రాత్రి దర్జాగా దొంగతనానికి వచ్చిన దృశ్యాలు నమోదయ్యాయి. తరచి చూస్తే అతగాడు పాత నేరస్థుడు దేసిరెడ్డి ఎల్లయ్యగా గుర్తించారు పోలీసులు.
Bank Robbery: ఎవరూ చూడలేదనుకున్నాడు..కానీ అవి పసిగట్టాయి
అతనో పాత నేరస్థుడు..ఎన్నిసార్లు చెప్పినా బుద్ధిమాత్రం మారలేదు. ఎవరూ చూడటం లేదనుకున్నాడో..ఎవరూ చూస్తారులే అనుకున్నాడో కానీ..బ్యాంకు దొంగతనానికి విఫలయత్నం చేసి..చివరికి పోలీసుల చేతికి చిక్కాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా నెరబైలులో జరిగింది.
ఎవరూ తనని గమనించడం లేదనుకున్న దొంగ మూడో కంటికి చిక్కాడు. ఎల్లయ్య గడ్డపారతో బీగాలు తొలగించి బ్యాంకులోకి ప్రవేశించిన దృశ్యాలు కనిపించాయి. బ్యాంకులోకి ప్రవేశించిన ఎల్లయ్య దొంగతనానికి విశ్వప్రయత్నం చేసి.. విఫలమైనట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ ఘటన ఆదివారం అర్థరాత్రి చిత్తూరు జిల్లా యర్రావారిపాళ్యం మండలంలోని నెరబైలు సప్తగిరి గ్రామీణ బ్యాంకులో జరిగింది. బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎల్లయ్యను అదుపులోకి తీసుకున్నట్లు సిఐ మురళీ కృష్ణ తెలిపారు.
ఇదీ చదవండి : MURDER: రెండ్రోజులుగా కన్పించని యువకుడు..ఈ రోజు ఏమైందంటే..!