Jagananna Colony InfraStructure: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జగనన్న కాలనీల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. ప్రభుత్వం కేటాయించిన స్థలాలు కొన్ని జనావాసాలకు దూరంగా...మరికొన్ని కొండగుట్టల్లో ఉండటంతో లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీరు, విద్యుత్, రోడ్లు వంటి కనీస మౌళిక వసతులు ప్రభుత్వం కల్పించలేదు. రోడ్లు లేకపోయినా...ఏదో విధంగా ఇబ్బందులు పడి వెళ్లినా.... నిర్మాణాలకు అవసరమైన కనీస వసతులు లేక లబ్ధిదారులు అల్లాడిపోతున్నారు. ప్రభుత్వం విడతల వారీగా ఇచ్చే లక్షా 80 వేల రూపాయలతో ... పునాదులు దాటి ఇళ్లు నిర్మాణాలు చేసుకోలేకపోతున్నారు.
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో చిందేపల్లి, ఊరందూర్ కాలనీల్లో నిర్మాణం ఏమాత్రం ముందుకు సాగడం లేదు. కేటాయించిన స్థలాలు అనువుగా లేవని భావించిన లబ్ధిదారుల్లో కొంత మంది స్థలాల రిజిస్ట్రేషన్లకు ముందుకు రాలేదు. రిజిస్ట్రేషన్ చేసుకొన్న వారిలో 50 శాతం మంది ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమైన వాటిలో కొన్ని ఇంకా పునాదుల దశలో ఉన్నాయి. ఏదోవిధంగా కొందరు ఇంటి నిర్మాణం పూర్తి చేసినా.... విద్యుత్ లేకపోవడం.... కనీస అవసరమైన నీటివసతి కల్పించకపోవడంతో ... తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని లబ్ధిదారులు వాపోతున్నారు.
ఇళ్ల నిర్మాణాలు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులు చెబుతున్నారని... మౌలిక వసతులు మాత్రం కల్పించడం లేదని లబ్ధిదారులు మండిపడుతున్నారు. నిర్మాణ ఖర్చు ఎక్కువ అవుతోందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.