తీసుకున్న అప్పు చెల్లించాలని అడగడంతో పాటు తన భార్య కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఒకరు, అక్కా బావలను విడదీశాడని మరొకరు ఓ వ్యక్తిపై కక్ష పెంచుకున్నారు. ఇద్దరు కలిసి పక్కాగా ప్లాన్ చేసి అతడిని అంతం చేశారు. చిత్తూరు జిల్లా కలికిరి మండలంలో సంచలనం సృష్టించిన ఈ కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకున్న వాల్మీకిపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగార్జున రెడ్డి.. నాలుగు రోజుల వ్యవధిలో సిబ్బంది సహకారంతో కేసును ఛేదించి నిందితులను పట్టుకున్నారు.
మదనపల్లి డీఎస్పీ రవి మనోహరాచారి తెలిపిన వివరాల మేరకు...
కలికిరి మండలం పారపట్ల గ్రామానికి చెందిన సి.నరసింహారెడ్డి అదే గ్రామానికి చెందిన వెంకటేష్‌కు రూ.10 వేల రూపాయలు అప్పుగా ఇచ్చి ప్రాంసరీ నోటు రాయించుకున్నాడు. నరసింహారెడ్డితరచూ మద్యం తాగి వచ్చి తన భార్య, కుమార్తె గురించి అసభ్యకరంగా మాట్లాడుతూ డబ్బులు ఇవ్వమని నలుగురిలో అవమానం చేసేవాడు. ఫలితంగా వెంకటేశ్ అతనిపై కక్ష పెంచుకున్నాడు.
ఇదిలా ఉండగా... నరసింహారెడ్డి కారణంగా తన అక్కా బావ విడిపోయారని ఇదే గ్రామానికి చెందిన ఎం .వెంకటరమణా రెడ్డి.. కక్ష పెంచుకున్నాడు. నరసింహారెడ్డి కారణంగా ఇబ్బందులు పడుతున్న వీరిరువురు ఒక్కటయ్యారు. ఎలాగైనా అతడిని అంతం చేయాలని నిర్ణయించుకున్నారు. పక్కా స్కెచ్ వేసి ఈ నెల 20వ తేదీన నరసింహారెడ్డికి ఫోన్ చేశారు. మేడి కుర్తి బాహుదానది ఒడ్డున ఉన్నామని, తీసుకున్న అప్పును తిరిగి ఇస్తామని అక్కడికి రావాలని చెప్పారు. నరసింహ రెడ్డి అక్కడికి రాగానే ముగ్గురు కలిసి మద్యం తాగారు. ముందుగానే తెచ్చుకున్న డ్రిప్ వైరుని నరసింహారెడ్డి మెడకు బిగించి హత్య చేసి అక్కడి నుంచి పారిపోయారు. మృతుడి తల్లి రాజమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కలికిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా హంతకులు పారపట్లకు చెందిన పసుపుల వెంకటేశు, ఎం. వెంకటరమణారెడ్డిగా గుర్తించారు. వారిద్దరిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరిచారు.
ఇదీ చదవండి:ప్రియురాలి తండ్రిని హత్య చేసిన వన్‌సైడ్ లవర్