భారీ విమానాల రాకపోకలకు వీలుగా... తిరుపతి విమానాశ్రయంలో రన్‌వే విస్తరణ పనులను చేపట్టినట్లు పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. రూ.177 కోట్లోత తిరుపతి ఎయిర్‌పోర్ట్ రన్‌వేను విస్తరించి, పటిష్ఠపరిచే పనులను చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు రాజ్యసభలో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు... కేంద్రమంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
రన్ వే విస్తరణ పనులు 2021 నాటికి పూర్తవుతాయని భావిస్తున్నట్లు మంత్రి తెలిపారు. రన్ వే విస్తరణ కోసం ఇంకా 30 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు అప్పగించాలన్నారు. ఇప్పటికే స్వాధీనం చేసిన భూమిలో ఉన్న హైటెన్షన్ విద్యుత్ లైన్ల తొలగింపులో జరుగుతున్న జాప్యం కారణంగానే పనులు మందగించాయని పేర్కొన్నారు.