ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Attack on Anna canteen అర్ధరాత్రి అన్న క్యాంటీన్​ కూల్చివేత, వైకాపా పనేనంటున్న తెదేపా - చిత్తూరు జిల్లాలో అన్న క్యాంటీన్​ ధ్వంసం

Attack on Anna canteen కుప్పంలో తెదేపా నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్‌ను దుండగులు ధ్వంసం చేశారు. ఆర్టీసీ బస్టాండ్‌ కూడలి వద్ద 86 రోజులుగా నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్‌ను కూల్చేశారు. ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద ఉన్న బ్యానర్లను చింపేశారు.

anna canteen
ధ్వంసమైన అన్న క్యాంటీన్‌

By

Published : Aug 30, 2022, 12:12 PM IST

Updated : Aug 31, 2022, 6:46 AM IST

.

చిత్తూరు జిల్లా కుప్పం ఆర్టీసీ బస్టాండు కూడలిలో ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద తెదేపా-ఎన్టీఆర్‌ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నక్యాంటీన్‌ను సోమవారం అర్ధరాత్రి అగంతుకులు ధ్వంసం చేసిన ఘటన మంగళవారం వెలుగుచూసింది. ఇక్కడ ఎన్టీఆర్‌ ట్రస్టు ఆధ్వర్యంలో 86 రోజులుగా నిత్యాన్నదానం నిర్వహిస్తున్నారు. శాశ్వత భవనం లేకపోవడంతో ఎన్టీఆర్‌ విగ్రహం ఎదుట తాత్కాలికంగా షెడ్లు ఏర్పాటుచేసి అన్నదానం చేపట్టారు. సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఎన్టీఆర్‌ ట్రస్టు బ్యానర్లు, షామియానాలను చించేశారు. సమాచారం తెలుసుకున్న తెదేపా ఇన్‌ఛార్జి పీఎస్‌ మునిరత్నంతో పాటు కార్యకర్తలు అక్కడికి చేరుకొని ధ్వంసమైన అన్నక్యాంటీన్‌ను పరిశీలించారు.

ఇది అధికార పార్టీ నాయకుల పనేనని పోలీసుస్టేషన్‌కు వెళ్లి నిరసన తెలిపారు. దాడికి పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు అందించారు. దాడిని నిరసిస్తూ ఎన్టీఆర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఎండలోనే అన్నదానం చేపట్టారు. భోజనం పెడుతున్న తెదేపా నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, కొన్ని రోజులు పోతే భోజనం తినే పేదవాడిపైనా కేసులు పెట్టేలా ఉన్నారని మునిరత్నం విమర్శించారు. ఆర్‌అండ్‌బీ అతిథిగృహం వద్ద తెదేపా బ్యానర్లను గుర్తుతెలియని వ్యక్తులు సోమవారం అర్ధరాత్రి చించి ధ్వంసం చేశారు. మంగళవారం ఉదయం పురపాలక అధికారులు రంగప్రవేశం చేసి అన్నక్యాంటీన్‌ బ్యానర్లు, షామియానాలను తొలగించారు. ప్రజలు, ఆర్టీసీ అధికారుల ఫిర్యాదు మేరకు బస్సులు, ప్రజల రాకపోకలకు ఇబ్బందికరంగా ఉండటంతో పక్కకు ఒరిగిన షెడ్లు తొలగించామని పురపాలక కమిషనర్‌ రవిరెడ్డి చెప్పారు.

.

ఘటనపై చంద్రబాబు, లోకేశ్‌ ఆగ్రహం:ఈ ఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు, పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా అధికారంలోకి రాగానే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 201 అన్నక్యాంటీన్లను మూసేశారన్నారు. పేదవాడి నోటికాడ కూడు లాక్కుంటున్నారని మండిపడ్డారు. కుప్పంలో దాడి చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండు చేశారు.

ఆటంకాలు ఎదురైనా అన్నదానం కొనసాగించండి: చంద్రబాబు
‘పేదవాడి ఆకలి తీర్చేందుకు తెదేపా అన్నం పెడుతుంటే.. వరుసగా దాడులు చేయించి, కేసులు పెట్టి అధికార పార్టీ అడ్డుకోవాలని చూస్తోంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగించండి. ఈ దాడిని గ్రామగ్రామాన ప్రజలకు తెలిసేలా చేయండి. మనం మంచి చేయాలని ప్రయత్నిస్తే చెడు చేసేందుకు అధికారపార్టీ రౌడీలు ఉంటారు. వాళ్ల అంతు చూస్తా. అన్నక్యాంటీన్‌ వద్ద, ప్రధాన నాయకుల ఇళ్లు, పార్టీ కార్యాలయం వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటుచేద్దాం. అవసరమైతే కోర్టుకెళ్దాం. కుప్పం నుంచే ధర్మపోరాటం ప్రారంభిద్దాం’ అని తెదేపా శ్రేణులకు చంద్రబాబు భరోసా కల్పించారు. మంగళవారం నియోజకవర్గ శ్రేణులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించి మాట్లాడారు. శాంతియుతంగా ఉన్న కుప్పం.. వైకాపా వల్ల రణరంగంగా మారిందని, ప్రజలు వైకాపాను బహిష్కరించే రోజులు దగ్గర పడ్డాయన్నారు.

అన్న క్యాంటీన్​పై దాడిని ఖండించిన నారా లోకేశ్​: తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కుప్పంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్లపై దాడి... సీఎం జగన్ రెడ్డి రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. కుప్పం ఆర్టీసీ బస్టాండ్ కూడలి వద్ద 86 రోజులుగా నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్​పై వైకాపా వారు అర్ధరాత్రి దాడి చేసి ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అధికారంలోకి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 201 అన్న క్యాంటీన్లను సీఎం జగన్​ రద్దు చేశారని, పేద వాడి నోటి దగ్గర కూడు లాక్కుంటున్నారని మండిపడ్డారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా అన్న క్యాంటీన్లు నిర్వహించి తీరుతామని తేల్చిచెప్పారు. కుప్పంలోని అన్న క్యాంటీన్​పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Aug 31, 2022, 6:46 AM IST

ABOUT THE AUTHOR

...view details