compassionate appointment : కారుణ్య నియామకం కింద ఫలానా పోస్టు కావాలని సంబంధిత వ్యక్తులు కోరలేరని హైకోర్టు స్పష్టం చేసింది. తనకు వీఆర్‌వో లేదా జూనియర్ అసిస్టెంట్ పోస్టును ఇచ్చేలా కలెక్టర్‌ను ఆదేశించాలంటూ పిటిషనర్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టేస్తూ ఏపీ పరిపాలన ట్రైబ్యునల్ 2018లో ఇచ్చిన నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. న్యాయమూర్తులు జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్‌రాయ్, జస్టిస్ వి.గోపాలకృష్ణారావుతో కూడిన ధర్మాసనం ఇటీవల ఈమేరకు తీర్పు ఇచ్చారు.
చిత్తూరు జిల్లా తంబాళపల్లె తహశీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తూ జి.మధుసూదనరావు మృతి చెందారు. ఆయన తనయుడు రాఘవేంద్రరావు తనకు కారుణ్య నియామకం కింద పోస్టు ఇవ్వాలని కలెక్టర్‌కు వినతి సమర్పించారు. దీంతో ఆఫీసు సబార్డినేట్ పోస్టు ఇస్తూ కలెక్టర్ ఉత్తర్వులిచ్చారు. రాఘవేంద్రరావు అప్పటికి ఇంటర్మీడియెట్ విద్యార్హత కలిగి ఉండటంతో చిత్తూరు జిల్లా పంచాయతీ కార్యాలయంలో 2014లో ఆఫీసు సబార్డినేట్ పోస్టు ఇచ్చారు. ఆ ఉద్యోగంలో చేరినట్లు రిపోర్టు చేయకపోవడంతో రాఘవేంద్రరావు దానిని కోల్పోయారు. మరోసారి కలెక్టర్‌కు వినతి సమర్పిస్తూ వీఆర్‌వో లేదా జూనియర్ అసిస్టెంట్ పోస్టు ఇవ్వాలని అభ్యర్థించారు. కలెక్టర్ అందుకు అంగీకరించలేదు.
కారుణ్య నియామకం కింద పిటిషనర్‌ను వీఆర్‌వోగా నియమించడానికి వీల్లేదన్నారు. తన అభ్యర్థనను కలెక్టర్ తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ రాఘవేంద్రరావు ఏపీ పరిపాలన ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. జోక్యం చేసుకోవడానికి ట్రైబ్యునల్ నిరాకరిస్తూ 2018లో ఉత్తర్వులిచ్చింది. ఆ ఉత్తర్వులను సవాలుచేస్తూ 2019లో రాఘవేంద్రరావు హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల విచారణ జరిపిన న్యాయస్థానం వ్యాజ్యాన్ని కొట్టేసింది. పిటిషనర్ డిగ్రీ ఉత్తీర్ణుడు కానందున కారుణ్య నియామకం కింద జూనియర్ అసిస్టెంట్‌గా నియమితులయ్యేందుకు అర్హుడు కాడని స్పష్టం చేసింది. ఆఫీసు సబార్డినేట్‌గా ఇచ్చిన పోస్టును సద్వినియోగం చేసుకోక దానిని కోల్పోయారని తెలిపింది.