Paper leak: పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన మొదటిరోజే తెలుగు ప్రశ్నపత్రం లీకైన ఘటన నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని అంకిరెడ్డిపల్లె జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో బుధవారం చోటుచేసుకుంది. ముందస్తు ప్రణాళిక ప్రకారం కొందరు ఉపాధ్యాయులు, సిబ్బంది కలిసి ప్రశ్నపత్రాన్ని బహిర్గతం చేసినట్లు విచారణలో గుర్తించారు. ఈ ఘటనలో పది మంది ఉపాధ్యాయులు, సిబ్బందిపై కేసు నమోదు చేసినట్లు జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సామున్, ఎస్పీ రఘువీరారెడ్డి బుధవారం రాత్రి విలేకర్లకు వెల్లడించారు. చీఫ్ సూపరింటెండెంట్ కె.సుధాకర్‌గుప్తా, డిపార్ట్‌మెంటల్ అధికారి పి.రామకృష్ణారెడ్డి, సిట్టింగ్ స్క్వాడ్ వై.రాఘవయ్య, ఇన్విజిలేటర్ కె.వీరేష్‌పై సస్పెన్షన్ వేటు వేశామన్నారు. వీరు నలుగురూ కొలిమిగుండ్ల మండలంలోని వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్నట్లు వెల్లడించారు.
‘కొలిమిగుండ్ల పరీక్ష కేంద్రంలో పదోతరగతి పరీక్షలకు 183 మంది విద్యార్థులు హాజరయ్యారు. చరవాణి ద్వారా ప్రశ్నపత్రం ఫొటో తెస్తే విద్యార్థులంతా ఉత్తీర్ణులయ్యేలా జవాబులు తయారు చేసి అన్ని గదులకు పంపాలని పాఠశాలలోని కొంతమంది సిబ్బంది, ఉపాధ్యాయులు మాట్లాడుకున్నారు. అందులో భాగంగానే క్లర్క్ కె.రాజేష్ మూడో నంబర్ గదిలో పరీక్ష రాస్తున్న ఓ విద్యార్థిని దగ్గర ఉన్న ప్రశ్నపత్రం ఫొటో తీశాడు. దాన్ని క్రాఫ్ట్ టీచర్ రంగనాయకులుకు పంపమని అక్కడే పనిచేస్తున్న ఉపాధ్యాయులు నాగరాజు, నీలకంఠేశ్వరరెడ్డికి ఇచ్చాడు. వారు దాన్ని 9 మంది ఉపాధ్యాయులకు వాట్సప్‌లో పంపించారు. నలుగురు పదో తరగతి విద్యార్థుల ద్వారా సమాధానపత్రాలను పరీక్ష కేంద్రంలోని తొమ్మిది గదులకు పంపారు. దీనిపై కొలిమిగుండ్ల పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేసి, విచారణ చేపట్టాం. రాజేష్, రంగనాయకులతో పాటు ఉపాధ్యాయులు నాగరాజు, నీలకంఠేశ్వర్‌రెడ్డి, పోతులూరు మధు, వనజాక్షి, దస్తగిరి, వెంకటేశ్వర్లు, లక్ష్మీదుర్గ, క్లర్క్ రాజేష్‌పై కేసు నమోదు చేశాం’ అని కలెక్టర్, ఎస్పీ వివరించారు. పొరుగు జిల్లాలో ప్రశ్నపత్రం బయటికి వచ్చిందని, దాన్ని కొందరు ఇక్కడ వాట్సప్ గ్రూప్‌లో పోస్ట్ చేశారని చిత్తూరు డీఈవో పురుషోత్తం ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిత్తూరు ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లోనూ కేసు నమోదైంది.
పరీక్ష మొదలైన 2 గంటల తర్వాతే బయటకు: కమిషనర్