కల్లూరు పీఎస్ వద్ద ఉద్రిక్తత.. తెదేపా కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్ - అన్నమయ్య జిల్లా తాజా వార్తలు
11:16 April 05
తెదేపా కార్యకర్తపై దాడిని వ్యతిరేకిస్తూ నిరసనకు తెదేపా పిలుపు
Tension at Kallur Police Station: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం కార్యకర్తపై దాడిని నిరసిస్తూ.. ఆ పార్టీ శ్రేణులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సదుం మండలం బూరగమందకు చెందిన రాజారెడ్డిపై ఈనెల ఒకటిన దుండగులు దాడి చేశారు. కల్లూరులో పెట్రోల్ బంకు వద్ద ఉన్న రాజారెడ్డిని... రెండు వాహనాలలో వచ్చి ఎత్తుకెళ్లి తీవ్రంగా కొట్టారు. స్థానికుల సమాచారంతో గాయపడిన రాజారెడ్డిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై తెలుగుదేశం నాయకులు తీవ్రంగా స్పందించారు. మంత్రి పెద్దిరెడ్డి అక్రమాలను ప్రశ్నించిన రాజారెడ్డిపై కక్షగట్టి దాడి చేశారని మంగళవారం ఆందోళన చేపట్టారు. కేసు నమోదులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ.. కల్లూరు పోలీస్‌స్టేషన్ వద్ద బైఠాయించారు. తెదేపా కార్యకర్తలను అడ్డుకొనేందుకు వైకాపా కార్యకర్తలూ స్టేషన్ వద్దకు వచ్చారు. ఈ క్రమంలో తెదేపా కార్యకర్తలపై పోలీసులు లాఠీలు ఝళిపించారు. దీనిపై పోలీసుల తీరుపై ఆ పార్టీ నేతలు మండిపడ్డారు.
ఇదీ చదవండి: దిల్లీలో అమరావతి రైతులు.. రాజధానిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుపై విజ్ఞప్తి