limited issue of US visa slots: అమెరికాలో ఉన్నత చదువులకు గాను వీసా ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్ దొరకడం పలువురికి అందని ద్రాక్షగా మారింది. పరిమితంగా వీసా స్లాట్లు జారీ చేయడంతో పెద్దసంఖ్యలో విద్యార్థులు ఇంకా ఎదురుచూపులు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు తరగతుల ప్రారంభ సమయం సమీపిస్తుండటంతో అమెరికా వెళ్లగలమా? లేదా? అన్న అయోమయంలో వారంతా కొట్టుమిట్టాడుతున్నారు.
అమెరికాలో ప్రస్తుత ఫాల్ సీజన్‌లో విద్యా సంవత్సరం జనవరి, ఫిబ్రవరిలో ప్రారంభం అవుతుంది. ఇంతవరకు మూడు దఫాలుగా వీసా స్లాట్లను విడుదల చేసినప్పటికీ అవి తక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. ప్రత్యేకించి హైదరాబాద్ కాన్సులేట్ పరిధిలో చాలా తక్కువగా విడుదలయ్యాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు విద్యార్థులు వ్యయప్రయాసలకోర్చి చెన్నై, ముంబయి తదితర ప్రాంతాల్లో ఇప్పటికీ ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.
విఫలమైన వారికి అవకాశమేదీ?:ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఒక దఫా వీసా ఇంటర్వ్యూకు హాజరై విఫలమైన వారికి మరో అవకాశం కల్పిస్తామని అమెరికా రాయబార కార్యాలయం సీజన్ ప్రారంభానికి ముందే ప్రకటించింది. సాధారణంగా వీసా ఇంటర్వ్యూకు ఎన్ని దఫాలైనా హాజరయ్యే అవకాశం ఉంటుంది. అయితే గత విద్యాసంవత్సరం నుంచి ఒక సీజన్‌లో ఒక దఫా మాత్రమే ఇంటర్వ్యూ స్లాట్ పొందేలా సాఫ్ట్‌వేర్‌లో అమెరికా ప్రభుత్వం మార్పులు చేసింది.