TDP CHIEF CHANDRABABU FIRE ON CM JAGAN: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి.. మూడు రోజుల కుప్పం పర్యటన ఈరోజు సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమైంది. పర్యటనకు ముందు చంద్రబాబు నాయుడు.. హైదరాబాద్ నుంచి బెంగుళూరు విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కుప్పం బయలుదేరారు. దీంతో విషయం తెలుసుకున్న పార్టీ కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలు.. డప్పుల దరువులతో, బాణా సంచాలు కాల్చుతూ.. భారీ గజమాలలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు.
టీడీపీ లక్ష్యం..పేదలను ధనికులు చేయడమే..ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు నియోజకవర్గ ప్రజలకు అభివాదం చేశారు. అనంతరం పార్టీ కార్యకర్తలను, యువతను ఉద్దేశించి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్టిపై, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై నిప్పులు చెరిగారు. ''ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది. కుప్పం గ్రానైట్‌ను ఇష్టారీతిగా దోచుకున్నారు. దోచుకున్నదంతా వెనక్కి రప్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. జగన్ మాదిరి అవినీతిపరుడు ఎవరూ లేరని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడే స్వయంగా చెప్పారు. జగన్ అవినీతిపై కేంద్ర ప్రభుత్వం చర్యలు ఎప్పుడు తీసుకుంటుందో చెప్పాలి..? ప్రజాధనాన్ని దోపిడీ చేసి విదేశాల్లో దాచుకుంటున్నారు. సంపద సృష్టించేది పేదలను ధనికులను చేసేందుకే. సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే సంక్షేమ కార్యక్రమాలు చేపట్టవచ్చు. పేదలను ధనికులను చేసే కార్యక్రమం చేపడతాం'' అని చంద్రబాబు నాయుడు అన్నారు.
జగన్..ఇది మీ తాతా జగీరా..?.. అనంతరం తాను ఇల్లు కట్టుకోవడానికి సైకో జగన్ అనుమతి ఇవ్వట్లేదని.. చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. 'జగన్.. ఈ రాష్ట్రం మీ తాత జాగీరా..? లేక మీ నాన్న సొత్తా?.. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు కోట్ల మంది ప్రజలది' అని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. గడిచిన నాలుగేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా రౌడీలు తెగ పెరిగిపోయారన్న చంద్రబాబు.. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రౌడీలను ఎక్కడికక్కడ అణగదొక్కుతామన్నారు. చివరికి కుప్పంలో రౌడీయిజం చేస్తూ.. తనపైనే దాడికి యత్నించారని చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు.
అన్నీ రాస్తున్నా..ఎవరినీ వదిలిపెట్టా..రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలపై, ప్రజలపై తప్పుడు కేసులు పెట్టిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. గడిచినా నాలుగేళ్లలో జరిగిన ప్రతి సంఘటనను లెక్కపెడుతున్నానని.. చిత్రగుప్తుడి మాదిరిగా డైరీలో రాస్తున్నానన్న చంద్రబాబు.. రాబోయే రోజుల్లో ఎవరినీ వదిలిపట్టానంటూ హెచ్చరించారు. మరో రెండు రోజులపాటు నియోజకవర్గంలోనే ఉంటానని, రేపటి భేటీలో అన్ని సమస్యలు చర్చించుకుందామని అన్నారు. చివరగా..'మీ రుణం తీర్చుకునే అవకాశం ఇవ్వాలని కోరుతున్నా' అని చంద్రబాబు నాయుడు నియోజకవర్గ ప్రజలను కోరారు.
అన్నీ రాసుకుంటున్నా.. ఎవరినీ వదిలిపెట్టా..: చంద్రబాబు చంద్రబాబు మూడు రోజుల పర్యటన వివరాలు..చిత్తూరు జిల్లా కుప్పంలో చంద్రబాబు నాయుడు మూడు రోజులు పర్యటించనున్నారు. తొలిరోజు కుప్పంలోని BCN కల్యాణ మండపంలో నాయకులు, ప్రజాప్రతినిధులతో సమావేశమై దిశానిర్దేశం చేస్తారు. రాత్రికి ఆర్ అండ్ బీ అతిథి గృహంలో బస చేయనున్నారు. రెండవ రోజు ఉదయం అతిథి గృహంలో ప్రజల నుంచి వినతుల స్వీకరించనున్నారు. అనంతరం కుప్పం బస్టాండు కూడలిలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద లక్ష మెజార్టీయే లక్ష్యం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. పర్యటనలో శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు, కాంగ్రెస్ డీసీసీ మాజీ అధ్యక్షుడు బీఆర్ సురేష్ బాబు తన అనుచరులతో కలిసి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. మూడవ రోజు పార్టీ శ్రేణులతో మండలాల వారీగా సమీక్ష నిర్వహించనున్నారు.