ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెలంగాణలో 57 శాతానికిపైగా సింగిల్‌ లైన్లే.. ఈ ఏడాది కొత్త రైల్వే బడ్జెట్​పై ఆశలు - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు

దక్షిణ మధ్య రైల్వే నుంచి రైల్వే శాఖకు ఊహించిన దానికన్నా ఎక్కువ లాభాలు వస్తున్నా.. కేంద్రబడ్జెట్​లో మాత్రం తెలంగాణకు అంతగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. దేశ రైల్వే నెట్‌వర్క్‌లో తెలంగాణ వాటా 3 శాతం కూడా లేదు. అందులోనూ రాష్ట్రంలో సింగిల్‌ లైన్లే 57 శాతానికి పైగా ఉన్నాయి. దీంతో రాష్ట్రం నుంచి కొత్త రైళ్లు పట్టాలు ఎక్కించడంలో, ఉన్నవాటిని వేగంగా నడిపించడంలోనూ అవరోధాలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆశలన్నీ బడ్జెట్‌ కేటాయింపులపైనే ఉన్నాయి.

Etv Bharat
Etv Bharat

By

Published : Jan 29, 2023, 12:50 PM IST

దక్షిణ మధ్య జోన్‌ నుంచి రైల్వేశాఖకు గతేడాది రూ.14,266 కోట్ల ఆదాయం రాగా.. ఈ ఆర్థిక సంవత్సరం(2022-23) డిసెంబరు ఆఖరు నాటికే రూ.13,787 కోట్లు వచ్చింది. మరో మూడు నెలల సమయం ఉండటంతో గతేడాది కంటే కనీసం రూ.4 వేల కోట్లకు పైగా ఎక్కువ లభించే అవకాశాలున్నాయి. జోన్‌లో అటు ప్రయాణికులు, ఇటు సరకుల రవాణాతో భారీగా ఆదాయం వచ్చే తెలంగాణకు కేంద్ర బడ్జెట్‌లో మాత్రం అత్తెసరు ప్రాధాన్యం కూడా లభించట్లేదు.

తెలంగాణ రాష్ట్రానికి గతేడాది కేవలం రూ.3 వేల కోట్ల నిధులు మాత్రమే కేటాయించారు. దేశ రైల్వే నెట్‌వర్క్‌లో రాష్ట్ర వాటా 3 శాతం కూడా లేదు. అందులోనూ సింగిల్‌ లైన్లే 57 శాతానికి పైగా ఉన్నాయి. దీంతో రాష్ట్రం నుంచి కొత్త రైళ్లు పట్టాలు ఎక్కించడంలో, ఉన్నవాటిని వేగంగా నడిపించడంలోనూ అవరోధాలు ఎదురవుతున్నాయి.

ఎంపీలతో సమావేశమే లేదు: ఏటా కేంద్ర బడ్జెట్‌కు ముందే రాష్ట్రంలోని లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో దక్షిణ మధ్య రైల్వే సమావేశం ఏర్పాటు చేసి.. వారి నుంచి ప్రతిపాదనలు స్వీకరిస్తుంది. తమ ప్రాంతాలకు అవసరమైన కొత్త రైల్వే లైన్లు, ప్రస్తుతం ఉన్న మార్గాల విస్తరణ, నూతన రైళ్లు, స్టాపేజీలు వంటి అనేక ప్రతిపాదనలను వారు ఇస్తారు. ప్రజల అవసరాలు, డిమాండ్లను వినిపిస్తారు. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికశాఖ మంత్రి బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. అయినా.. ఈసారి సమావేశమే పెట్టలేదు. జోన్‌ నుంచి రైల్వే బోర్డుకు ఏం ప్రతిపాదనలు పంపారన్న విషయంపై మాట్లాడేందుకు అధికారులు సుముఖత వ్యక్తం చేయట్లేదు.

సింహభాగం సింగిలే:రైళ్లు అతి వేగంతో పరుగులు పెట్టాలన్నా, ఎక్కువ సంఖ్యలో నడిపించాలన్నా ట్రాకే కీలకం. ఓ వైపు ప్రయాణికులు, మరోవైపు సరకు రవాణా రైళ్లు నడుస్తుంటాయి. మూడు లైన్ల మార్గం ఉంటే రైళ్లను పరుగులు పెట్టించొచ్చు. రెండు లైన్ల మార్గం ఉంటే పర్వాలేదు. సింగిల్‌ లైన్‌ ఉంటే.. ఒక రైలు వెళ్తోంటే మరోటి ఆపాలి. తెలంగాణలో ఇలాంటి సింగిల్‌ లైన్లే ఎక్కువగా ఉన్నాయి.

నెట్‌వర్క్‌కు నోచుకోని ప్రాంతాలెన్నో:దేశాలు, రాష్ట్రాలు, ప్రాంతాల అభివృద్ధిలో రవాణా రంగానిది కీలక పాత్ర. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల వారిని ఉపాధి, ఉద్యోగ, వ్యాపార, పర్యాటకంగా ఆకర్షించే నగరాలు, పట్టణాలు, ప్రాంతాలు రాష్ట్రంలో అనేకం ఉన్నాయి. ఉత్తరాది నుంచే లక్షల మంది కార్మికులు నగరానికి వస్తుంటారు. వ్యాపార వర్గాలవారు, ఐటీ ఉద్యోగులూ లక్షల్లో ఉన్నారు.

వైద్యం కోసమూ పెద్దసంఖ్యలో హైదరాబాద్‌కు వస్తుంటారు. యునెస్కో నుంచి ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన రామప్ప ఆలయం, పర్యాటక గ్రామం పోచంపల్లి, సుందర జలపాతం బొగత, పెద్దపులులు, ఇతర క్రూరమృగాలు, నల్లమల అందాలు, కృష్ణమ్మ పరుగులతో పర్యాటకుల్ని ఆకర్షించే అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వు, అతిపెద్ద గిరిజన జాతర సమక్క-సారలమ్మ, ప్రపంచ బౌద్ధ పర్యాటకుల్ని ఆకర్షించే నాగార్జునసాగర్‌లోని బుద్ధవనం, సూర్యాపేట జిల్లా ఫణిగిరి.. ఇలా రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకు ఇప్పటికీ రైల్వే నెట్‌వర్క్‌ లేదు.

సూర్యాపేట మీదుగా లైన్‌ ఊసేదీ?:కొత్త మార్గాలు, ఉన్నవాటి విస్తరణపై అనేక డిమాండ్లు ఉన్నాయి. సూర్యాపేట మీదుగా హైదరాబాద్‌-విజయవాడ రైల్వే లైన్‌ డిమాండ్‌ దశాబ్దకాలంగా గట్టిగా వినిపిస్తోంది. ఎంపీలు ఏటా అడుగుతున్నా రైల్వేశాఖ స్పందించట్లేదు. దీన్ని మంజూరు చేస్తే కనీసం 60 కి.మీ. దూరం తగ్గుతుంది. సికింద్రాబాద్‌-శ్రీశైలం రోడ్డు సర్వే పూర్తయినా ఆర్థికంగా గిట్టుబాటు కాదని రైల్వేశాఖ పక్కన పెట్టింది. శ్రీశైలం వెళ్లే భక్తులతో పాటు అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వుకు పర్యాటకానికి, వెనుకబడిన నాగర్‌కర్నూల్‌ జిల్లా అభివృద్ధికి దోహదం చేసే ప్రాజెక్టు ఇది.

కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయలోపం:కొత్త ప్రాజెక్టుల మంజూరు, ఉన్నవాటిని వేగంగా పూర్తి చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయలోపం కనిపిస్తోంది. యాదాద్రి ఎంఎంటీఎస్‌, మనోహరాబాద్‌-కొత్తపల్లి, ఆర్మూర్‌-నిర్మల్‌-ఆదిలాబాద్‌ వంటి ప్రాజెక్టులు ఈ జాబితాలో ఉన్నాయి.

నిధులు భారీగా ఇస్తేనే:

  • సికింద్రాబాద్‌ స్టేషన్‌ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయనున్నట్లు రైల్వేశాఖ మంత్రి ఇటీవల ప్రకటించారు. అంచనా వ్యయం రూ.699 కోట్లు. నిర్మాణ సమయం 36 నెలలు. ఈ బడ్జెట్‌లో కనీసం రూ.300 కోట్లయినా మంజూరు చేస్తేనే అనుకున్న సమయంలో పనులు జరగడానికి ఆస్కారం ఉంటుంది.
  • కాజీపేట పీరియాడికల్‌ ఓవర్‌హాలింగ్‌(పీఓహెచ్‌) వర్క్‌షాప్‌ ప్రాజెక్టు దాదాపు అయిదేళ్లు ఆలస్యమైంది. దీంతో అంచనా వ్యయం దాదాపు రూ.వంద కోట్లు పెరిగింది. గత నెలలో గుత్తేదారును ఎంపిక చేశారు. అంచనా వ్యయం రూ.361.79 కోట్లు. కనీసం రూ.200 కోట్లు కేటాయిస్తే తప్ప ఈ ప్రాజెక్టు సకాలంలో పూర్తికాదు.
  • హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌ను అనుసంధానించే మనోహరాబాద్‌-కొత్తపల్లి మార్గానికి ఈసారి భారీ కేటాయింపులు అవసరం.
  • ఘట్‌కేసర్‌-రాయగిరి ఎంఎంటీఎస్‌ విస్తరణ ప్రాజెక్టుకు నాలుగైదేళ్లుగా నిధుల్లేవు. ఈసారైనా కేటాయిస్తే యాదాద్రి భక్తులకు చౌక ప్రయాణం అందుబాటులోకి వస్తుంది. కాజీపేట వరకు మూడో లైను మంజూరు చేస్తే.. హైదరాబాద్‌ నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు, ఏపీ, తమిళనాడు, ఈశాన్య రాష్ట్రాల వైపు రాకపోకలు సులభమవుతాయి.
  • దేశంలోని మహానగరాల్లో హైదరాబాద్‌, ముంబయి, బెంగళూరు కీలకమైనవి. కానీ, హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు, ముంబయికి చాలా దూరం సింగిల్‌ లైన్లలోనే ఆగుతూ..సాగుతూ రైళ్లు ప్రయాణించాల్సిన పరిస్థితి ఉంది. వీటిని పూర్తిస్థాయిలో డబుల్‌ లైన్లుగా మార్చాలి.
  • బీబీనగర్‌ నుంచి నల్గొండ, మిర్యాలగూడెం, ఏపీలోని నల్లపాడు వరకు సింగిల్‌ లైనే ఉంది. డబుల్‌ లైన్‌పై సర్వే పూర్తయి ఏడాది దాటింది. ఇప్పటికైనా మంజూరు చేయాలి.
  • కాజీపేట-హుజూరాబాద్‌-కరీంనగర్‌, ఘన్‌పూర్‌-సూర్యాపేట వయా పాలకుర్తి, ఆదిలాబాద్‌-నిర్మల్‌-ఆర్మూర్‌, పటాన్‌చెరు-సంగారెడ్డి-మెదక్‌ వంటి ప్రతిపాదిత లైన్లను మంజూరు చేయాలి. రామగుండం-మణుగూరు కొత్త లైనుకు రైల్వే బోర్డు సూత్రప్రాయ ఆమోదం లభించింది. బడ్జెట్‌లో ప్రకటిస్తే దీర్ఘకాల డిమాండ్‌కు మోక్షం లభిస్తుంది. మోటుమర్రి-విష్ణుపురం సింగిల్‌ లైన్‌లో ప్రస్తుతం గూడ్స్‌ రైళ్లను అనుమతిస్తున్నారు. దీన్ని డబ్లింగ్‌ చేస్తే ప్రయాణికుల రైళ్లను పట్టాలు ఎక్కించడానికి వీలవుతుంది. హైదరాబాద్‌-విజయవాడ మార్గాల్ని అనుసంధానించే లైనవుతుంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details