చిత్తూరు జిల్లా రామసముద్రం మండలం ఆర్.నడింపల్లిలో తెదేపా నేత మునెప్పపై వైకాపా నేతలు కత్తులతో దాడి చేశారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (atchannaidu) ధ్వజమెత్తారు. మునెప్ప భూమిని కబ్జా చేయడం సహా... అడ్డుకున్నందుకు మారణాయుధాలతో దాడులకు తెగబడ్డారని ఆరోపించారు. మునెప్పకు పార్టీ అండగా ఉంటుందన్నారు. దాడికి పాల్పడినవారిపై చర్యలు తీసుకునేవరకు వెనక్కి తగ్గబోమని తేల్చి చెప్పారు.
అభివృద్ధికి మారుపేరుగా నిలిచిన ఆంధ్రప్రదేశ్‌ను అరాచకాలు, ఆకృత్యాలు, దౌర్జన్యాలు, దుర్మార్గాలకు చిరునామాగా జగన్ మార్చేశారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. పేదల ఆస్తులు అక్రమించి దాడులతో మారణహోమం సృష్టించేందుకే ఒక్క అవకాశం అడిగారా? అని నిలదీశారు. వైకాపా పాలనలో దాడులు జరగని రోజు అంటూ లేదన్నారు. రాజారెడ్డి కత్తుల రాజ్యాంగం అమలు చేస్తూ... అడ్డుకున్న వారిని హతమార్చేందుకు తెగబడుతున్నారని ఆరోపించారు. జగన్ పాలనలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. రాష్ట్రాన్ని రావణకాష్ఠంలా మండిస్తూనే ఉన్నారని అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు.