తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఉద్రిక్తతల మధ్య కొనసాగుతోంది. 24 వార్డులలో ఎన్నికలు జరుగుతున్నాయి. 16వ వార్డులో దొంగ ఓట్లు వేస్తున్నారంటూ స్థానికేతరులను గుర్తించిన తెలుగుదేశం ఏజంట్లు... వారిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. తర్వాత వారిని పోలీసులు వదిలివేశారు. దీనికి నిరసనగా తెలుగుదేశం శ్రేణులు పోలింగ్ కేంద్రాల వద్ద నిరసనకు దిగారు. స్థానికేతరులను పోలింగ్ కేంద్రాల నుంచి పంపించి వేయాలంటూ నినాదాలు చేశారు. ఆందోళన చేస్తున్న తెలుగుదేశం కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
16వ వార్డులో పోలింగ్ కేంద్రం వద్ద రిగ్గింగ్‌కు ప్రయత్నిస్తున్నారని తెలుగుదేశం శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. జనరల్ ఏజెంట్‌ను పోలింగ్ కేంద్రం నుంచి పోలీసులు పంపించి వేశారు. దీనిపై తెలుదేశం శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేశాయి. 18, 19వార్డుల్లో దొంగ ఓట్లు వేసేందుకు యత్నిస్తుండగా స్థానిక ఏజెంట్లు వారిని గుర్తించి పోలీసులకు అప్పగించారు. యువకులను కడప జిల్లా రాయచోటికి చెందిన వారిగా గుర్తించారు. మరోవైపు కుప్పంలోని కొత్తపేట జూనియర్ కళాశాల పోలింగ్ కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది. ఓటర్లు కానివారికి స్లిప్పులు ఇస్తున్నారంటూ తెదేపా శ్రేణులు నిరసన తెలియజేశాయి. దీంతో పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు.
అనంతపురం జిల్లా పెనుగొండ నగర పంచాయతీ పోలింగ్‌లో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు ఎంపీ గోరంట్ల మాధవ్ ప్రయత్నించగా.. అక్కడే ఉన్న తెదేపా మాజీ ఎమ్మెల్యే పార్థసారథి అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం నెలకొంది. పోలీసులు వారికి సర్దిజెప్పి అక్కడి నుంచి పంపించారు.
వీడియోలను బయటపెట్టిన తెదేపా..