చిత్తూరు జిల్లా కుప్పంలో వందశాతం నాణ్యమైన విద్యుత్తు అందించటమే లక్ష్యంగా... 1981లో ఏర్పాటైన గ్రామీణ విద్యుత్ సహకార సమాఖ్య- రెస్కోను రద్దు చేస్తూ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ తీసుకున్న నిర్ణయంపై ఆందోళన వ్యక్తమవుతోంది. కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల సహా... వి.కోట నియోజకవర్గంలోని పది పంచాయతీలతో కలిపి మొత్తం 110 పంచాయతీలు... 697 గ్రామాల్లో లక్షా ఇరవై రెండు వేల మంది ఈ సంస్థలో వాటాదార్లుగా ఉన్నారు. లక్షా ఇరవై నాలుగు వేల గృహ, వాణిజ్య, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు కుప్పం రెస్కో పరిధిలో ఉన్నాయి.
ప్రత్యేకించి చెరకు, టమాటా, పట్టు, ఉద్యాన పంటల రైతులకు స్థానికంగా ఉన్న రెస్కోనే ఆసరాగా నిలుస్తోంది. అలాంటిది సంస్థను రద్దు చేస్తూ.. ఏపీ ఎస్పీడీసీఎల్లో విలీనం చేయాలంటూ ఈఆర్సీ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ అంశంపై తెదేపా అధినేత చంద్రబాబు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాయగా... ఆదివారం కుప్పం నియోజకవర్గంలో తెదేపా నేతలు ఆందోళన నిర్వహించారు. తమ జీవనాధారంగా ఉన్న సంస్థను పసలేని కారణాలతో నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందంటూ నినాదాలు చేశారు.