మంత్రి పెద్దిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జలకు తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు సవాల్ విసిరారు. చిత్తూరు జిల్లా కుప్పం పంచాయతీ ఎన్నికల్లో రూ. 20 కోట్లు ఖర్చు పెట్టలేదని కాణిపాకం విఘ్నేశ్వరుడిపై ప్రమాణం చేయగలరా అని లేఖలో ప్రశ్నించారు. సంక్షేమం పేరిట ఎన్నికల ఫలితాలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. సాయంత్రం 7 తర్వాత ఓట్ల లెక్కింపు చేయవద్దని, పోలీసులు లెక్కింపు కేంద్రాల్లోకి ప్రవేశించరాదని.. ఎన్నికల సంఘాన్ని వైకాపా అడగగలదా అని నిలదీశారు.
ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులకు రెండంకెల మెజారిటీ వచ్చినా.. ఓట్ల లెక్కింపును అర్థరాత్రి వరకు సాగదీసి, రీకౌంటింగ్ చేసి ఫలితాలు తారుమారు చేస్తున్నారని విమర్శించారు. ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కునే బూటకపు సంక్షేమాన్ని ప్రజలు గ్రహించి.. మూడో దశ పంచాయితీ ఎన్నికల్లో తెదేపాకు మెజారిటీ ఇచ్చారని లేఖలో శ్రీనివాసులు పేర్కొన్నారు. గత 20 నెలల వైకాపా పాలనలో అప్పులు, పన్నులతో పాటు నిత్యవసర ధరలు పెంచి.. ఒక్కో కుటుంబంపై రూ. 2,35,800 భారం మోపారని మండిపడ్డారు.